సాయమందిస్తాం..మోడీకి పాకిస్తాన్ ఈదీ ఫౌండేషన్ లేఖ

కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ కు సాయం చేసేందుకు ముందుకొచ్చింది పాకిస్తాన్ కు చెందిన ఈదీ ఫౌండేషన్.

సాయమందిస్తాం..మోడీకి పాకిస్తాన్ ఈదీ ఫౌండేషన్ లేఖ

Edhi Foundation

Edhi Foundation కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ కు సాయం చేసేందుకు ముందుకొచ్చింది పాకిస్తాన్ కు చెందిన ఈదీ ఫౌండేషన్. ఈ మేరకు ఈదీ ఫౌండేషన్ చైర్మన్,ప్రముఖ మానవహక్కుల కార్యకర్త ఫైసల్ ఈదీ..భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి శుక్రవారం ఓ లేఖ ద్వారా విజ్ణప్తి చేశారు. కరోనా మహమ్మరిపై పోరాటంలో సాయపడేందుకు 50 అంబులెన్స్ లు, వలంటీర్ల బృందంతో భారత్ కు వచ్చేందుకు అనుమతినివ్వాలని మోడీకి రాసిన లేఖలో ఫైసల్ ఈదీ కోరారు. తానే స్వయంగా టీమ్ ని లీడ్ చేసేందుకు అనుమతివ్వాలని ఆ లేఖలో కోరారు.

భారత్ లో కరోనామహమ్మారి బీభత్సం సృష్టిస్తోందని, అనేకమంది ప్రజలు తీవ్రంగా భాధపడుతున్నారని తెలిసి ఎంతో విచారిస్తున్నాం. ఒక పొరుగు మిత్రునిగా, ఈ కఠినమైన సమయంలో, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను పరిష్కరించడంలో మీకు సహాయపడటానికి మా సేవలతో పాటు 50 అంబులెన్స్‌ల రూపంలో మా సహాయాన్ని అందించాలనుకుంటున్నాము. మీ దేశంలో ప్రవేశించేందుకు కేవలం పర్మిషన్ ఇవ్వండి.. మా డాక్టర్లు, మెడికల్ టెక్నీషియన్లు, మా ఆఫీస్ స్టాఫ్, చివరకు డ్రైవర్లు కూడా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు అని ఫైసల్ ఈదీ తెలిపారు. భారత ప్రభుత్వం నుంచి తాము ఎలాంటి సాయం కోరడం లేదని, తమ స్టాఫ్ కు ఆహారం, ఇంధనం వంటి అవసరాలను తామే సమకూర్చుకుంటామని ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కు పంపిన లేఖలో ఫైజల్ ఈదీ తెలిపారు.

కాగా,కరోనా పోరాటంలో భారత్ కు సాయం చేయండి అంటూ పాకిస్తాన్ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నెటిజన్లు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ట్విట్టర్ ద్వారా విజ్ణప్తి చేస్తున్న సమయంలో ఈదీ ఫౌండేషన్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. భారత ప్రధాని మోడీకి ఫైజల్ ఈదీ లేఖ రాయడంపై పాక్ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈదీ ఫౌండేషన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అయితే,ఫైసల్ ఈదీకి పాకిస్తాన్ లో అతి పెద్ద చారిటబుల్ అంబులెన్స్ నెట్ వర్క్ ఉంది. గతంలో ఈధీ ఫౌండేషన్.. పాకిస్థాన్ సహా ఇండియాలో కూడా పలు ధార్మిక కార్యక్రమాలు చేపట్టింది. తమ దేశంలో 15 ఏళ్లుగా చిక్కుకున్న భారతీయ బధిర, మూగ యువతి గీతను భారత్ కు చేర్చడంలో ఈ ఫౌండేషన్ సాయపడింది. గీతను పాకిస్తాన్ లో బాగా చూసుకోవడమే కాకుండా, గీత ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత స్వతంత్రాన్ని,మత సంప్రాదాయాలను గౌరవించిన ఈదీ ఫౌండేషన్ ను 2015లో ప్రధాని మోడీ ప్రశంసించారు. అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఈదీ ఫౌండేషన్ ను ప్రశంసించారు. 2015లో గీతను భారత్ కు చేర్చడంలో సాయపడిన ఈదీ ఫౌండేషన్ కు మోడీ ప్రభుత్వం కోటి రూపాయల డొనేషన్ ప్రకటించింది. అయితే ఈదీ ఫౌండేషన్ దీనిని సున్నితంగా తిరస్కరించింది.