పేషెంట్‌ను రిఫర్ చేస్తే లక్ష: కరోనా టైమ్‌లో డాక్టర్ల కక్కుర్తి, నెలన్నరలో కోటిన్నర కమీషన్

  • Published By: vamsi ,Published On : August 25, 2020 / 10:02 AM IST
పేషెంట్‌ను రిఫర్ చేస్తే లక్ష: కరోనా టైమ్‌లో డాక్టర్ల కక్కుర్తి, నెలన్నరలో కోటిన్నర కమీషన్

ఠాగూర్ సినిమాలో హాస్పిటల్‌లో చనిపోయిన వ్యక్తికి వైద్యం చేసి డాక్టర్లు డబ్బులు దండుకునే సన్నివేశం చూసే ఉంటారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో అందులోనూ కార్పోరేట్ హాస్పిటళ్లలో కొందరు డాక్టర్ల కాసుల కక్కుర్తి అలాగే ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. అయితే ప్రాణాలు కాపాడే దేవుళ్లుగా భావించే డాక్టర్లు.. డబ్బులు కోసం అడ్డదారులు తోక్కడం.. అందులోనూ కరోనాను క్యాష్ చేసుకోవడం కాస్త ఆందోళన కలిగించే విషయం అవుతుంది.

కరోనా కష్టకాలంలో ఏ మూల నుంచి వైరస్ వచ్చి సోకుతుందో తెలియక ఓ వైపు ప్రజలు బయపడుతుంటే.. టైమ్ బాగోలేక వైరస్ వచ్చిన రోగుల నుంచి భారీగా డబ్బులు నొక్కేస్తున్నాయి హాస్పిటళ్లు ఉన్నవాళ్లు, లేనివాళ్లు అనే తేడా లేకుండా సీరియస్.. సీరియస్ అంటూ హడావుడి చేస్తూ ప్రైవేటు హాస్పిటళ్లు హోం ఐసోలేషన్ సరిపోయే కేసుల నుంచి కూడా లక్షల్లో దోపిడి చేస్తున్నాయి.



తెలంగాణ, ఆంధ్ర అనే తేడా లేకుండా.. దేశంలో ప్రతి రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. రోగులు కూడా ప్రభుత్వం చేయించే వైద్యంపై నమ్మకం పెట్టుకోకుండా ప్రైవేటు హాస్పిటళ్లను ఆశ్రయించడంతో వారి దందాకు అంతం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే కొందరైతే దగ్గు జలుబు, జ్వరం వస్తే చాలు.. ‘కరోనా పాజిటివ్‌’ అంటూ బాధితుల భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలు నడిపే కొందరు డాక్టర్లు, ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రులతో ముందే ఒప్పందం కుదుర్చుకుని, అనుమానిత కేసుల్ని అక్కడికి పంపేస్తున్నారు. కమీషన్ కక్కుర్తితో కోట్లు నొక్కేస్తున్నారు.

డాక్టర్ ప్రతాప్ రాజా నెల్లూరు(పేరు, ఊరు మార్చాం)లో ఓ ప్రైవేట్ క్లీనిక్ నడుపుతున్నారు. ఇటీవలికాలంలో తన క్లీనిక్‌కి జలుబు, దగ్గు వచ్చినా సరే కరోనా టెస్ట్‌లు చేయిస్తున్నాడు. పాజిటివ్‌ వస్తే, లక్షణాలు కొద్దిగా ఉన్నా కరోనా తీవ్రంగా ఉందంటూ కొన్ని ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తున్నాడు. అలా చేసినందుకు సంబంధిత ప్రైవేట్‌ ఆసుపత్రి ఒక్కో కేసుకు లక్ష రూపాయలు కమీషన్‌ కింద డాక్టర్ గారికి చెల్లిస్తుంది. ఈ కరోనా కాలంలో ఒక నెల రోజుల్లోనే ఇప్పటివరకు వంద కేసులు రిఫర్‌ చేసి రూ.కోటి సంపాదించుకున్నాడు.



అలాగే హైదరాబాద్ నగరంలో కృష్ణ మనోహర్(పేరు మార్చాం) నడిపే నర్సింగ్‌ హోంకు కరోనా చికిత్సచేసే అనుమతి లేదు. అయితే తన వద్దకు ఎవరైనా కరోనా అనుమానిత లక్షణాలతో వస్తే, సీటీ స్కాన్‌తో కరోనా నిర్ధారణ పరీక్ష చేసి.. కార్పోరేట్ ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తాడు. ఇలా చేసినందుకు అతనికి నెలన్నరలో కోటిన్నర ముట్టాయి.

వాస్తవానికి ఇందులో డాక్టర్ల తప్పు ఎంత ఉందో? ప్రజల తప్పు కూడా అంతే ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన సేవలు అందుతున్నా కూడా చాలామంది బాధితులు పేరున్న ఆసుపత్రుల్లోనే చికిత్స పొందాలని భావిస్తూ డబ్బులు పోగొట్టకుంటున్నారు. డాక్టర్లు కూడా ఆసుపత్రుల్లో పడకలు తక్కువగా ఉన్నాయంటూ రిఫరెన్స్ చేసి పడకలు ఇప్పిస్తాం అంటూ చెప్తుండడంతో నమ్మేసిన అమాయకులు బలైపోతున్నారు.