కరోనా తొలి వ్యాక్సిన్ నాకే: కేంద్ర మంత్రి ప్రకటన

  • Published By: vamsi ,Published On : September 13, 2020 / 08:54 PM IST
కరోనా తొలి వ్యాక్సిన్ నాకే: కేంద్ర మంత్రి ప్రకటన

దేశంలో కరోనా వైరస్‌‌ను కంట్రోల్ చెయ్యడానికి కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే పలు వ్యాక్సిన్‌లు తయారీకి కేంద్రం సహకరిస్తుండగా.. దేశవ్యాప్తంగా కోవిడ్‌ మాత్రం కంట్రోల్‌కి రాట్లేదు. ఇప్పటికే చాలా ఔషద సంస్థలు రెండోదశ ప్రయోగాలను పూర్తి చేసుకుని మూడో స్టేజ్‌కు ప్రవేశించాయి. ఈ క్రమంలోనే దేశంలో వైరస్‌ వ్యాప్తి, వాక్సిన్‌ తయారీపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ కీలక ప్రకటన చేశారు.

దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సిన్ మాత్రమే మార్గమని, 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో కరోనాకు విరుగుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. వైరస్‌పై పోరులో ముందుండి ప్రజలను రక్షిస్తున్న డాక్టర్లు, పోలీసులు, మున్సిపల్‌ సిబ్బందికి తొలుత వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచుతామని ఆయన అన్నారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నాటికి కరోనా వ్యాక్సిన్ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఆన్‌లైన్ చర్చ సందర్భంగా ఆరోగ్య మంత్రి ఈ విషయం వెల్లడించారు.

టీకా తయారు చేసిన తర్వాత ప్రజలకు ఏమైనా అనుమానం వస్తే, మొదట టీకా నేనే తీసుకుంటానని ఆరోగ్య మంత్రి చెప్పారు. టీకా అందుబాటులో ఉన్నప్పుడు, మొదట ఆరోగ్య కార్యకర్తలు, సీనియర్ సిటిజన్లు మరియు ఫ్రంట్‌లైన్‌లో పనిచేసే కరోనా వారియర్స్‌కి ఇస్తామని చెప్పారు.

కరోనాకు వాడే మెడిసిన్‌ను బ్లాక్ మార్కెటింగ్ చేసినట్లు ప్రభుత్వానికి నివేదికలు వచ్చాయని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌ను కోరినట్లు చెప్పారు. దీని గురించి మాట్లాడమని రాష్ట్రాలను కూడా కోరినట్లు వెల్లడించారు.

కాగా దేశంలో గడిచిన 24 గంటల్లో భారత్‌లో అత్యధికంగా 97,570 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు వెలుగుచూసిన కేసుల సంఖ్య 46,59,984 కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 10,71,702 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా, మొత్తం పరీక్షల సంఖ్య 5,62,60,928 చేరుకుంది.

భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్, రష్యాకు చెందిన స్పుత్నిక్ వి, జాన్సన్ & జాన్సన్ యొక్క Ad26 Cov2.S, ఫ్లూజెన్స్ కోరోఫ్లూ మరియు సనోఫీ రాబోయే వ్యాక్సిన్ అన్నీ హైదరాబాద్‌లో నుంచే వచ్చాయి. ఒక ఆంగ్ల వార్తాపత్రికలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన అన్ని వ్యాక్సిన్ కంపెనీలు తయారీ సాంకేతిక పరిజ్ఞానంలో చాలా బలంగా ఉన్నాయి.