ఆరోగ్య సేతు యాప్ విస్తృత వినియోగం ఎందుకు అవసరం అంటే

కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఈ భయంకరమైన వైరస్ ఎప్పుడు, ఎలా ఎటాక్

  • Published By: naveen ,Published On : May 26, 2020 / 03:11 AM IST
ఆరోగ్య సేతు యాప్ విస్తృత వినియోగం ఎందుకు అవసరం అంటే

కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఈ భయంకరమైన వైరస్ ఎప్పుడు, ఎలా ఎటాక్

కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఈ భయంకరమైన వైరస్ ఎప్పుడు, ఎలా ఎటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి. మన చుట్టుపక్కల ఉన్నవారిలో ఎవరికి వైరస్ ఉందో తెలుసుకోవడం కూడా కష్టం. భారతదేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా వైరస్‌పై ఇప్పటికే లాక్‌డౌన్‌ యుద్ధం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ వార్‌కూ దిగింది. వైరస్‌ వ్యాప్తి కట్టడికి తీసుకోవల్సిన జాగ్రత్తలు, దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య, అప్‌డేట్స్‌ను ప్రజలకు అందించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక యాప్ తీసుకొచ్చింది. దీని పేరు ‘ఆరోగ్యసేతు’ యాప్‌. ఏప్రిల్ 2న నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ ద్వారా ఈ యాప్‌ వినియోగంలోకి వచ్చింది. ప్రైవేటు భాగస్వామ్యంతో కేవలం 4 రోజుల్లోనే దీన్ని డిజైన్ చేశారు. 

అసలు ఆరోగ్య సేతు యాప్ ని కేంద్రం ఎందుకు తీసుకొచ్చింది? దీని అవసరం ఏంటి? దీని ప్రాముఖ్యత ఏంటి? ప్రతి ఒక్కరూ ఈ యాప్ ని తప్పనిసరిగా ఇన్ స్టాల్ చేసుకోవాలని కేంద్రం ఎందుకు పదే పదే చెబుతోంది? కరోనా వైరస్ పై విజయం సాధించడంలో ఈ యాప్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? అసలు భారతీయులు ఈ యాప్ ను ఎందుకు ఇన్ స్టాల్ చేసుకోవాలి? ఈ యాప్ కరోనా నుంచి మనల్ని ఎలా కాపాడుతుంది? ఆరోగ్య సేతు యాప్ విస్తృత వినియోగం ఎందుకు అవసరం?

ఒక్క మాటలో చెప్పాలంటే కరోనా వైరస్ ట్రాకింగ్ యాప్:
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ బాధితుల వివరాలు ఇందులో ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేస్తుంటారు. రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా వైరస్‌ విరుగుడుకు ఇంకా మందు రాలేదు. అవగాహన, అప్రమత్తతోనే దీనిని ఎదుర్కోగలమని చెబుతోన్న ప్రభుత్వం.. ఆ దిశగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రత్యేకంగా ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కరోనా వైరస్ ట్రాకింగ్ యాప్. లొకేషన్ డేటా, బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా ఇది పనిచేస్తుంది.

ఆరోగ్య సేతు యాప్ ప్రత్యేకత: 
ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే, ఒకవేళ మీకు సమీపంలోకి ఎవరైనా కరోనా బాధితుడు వస్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది. తద్వారా కరోనా ముప్పు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాగే, ఎవరైనా ఒక వ్యక్తి అప్పటికే కరోనా పాజిటివ్‌గా నమోదైన వ్యక్తితో కాంటాక్ట్ అయినట్టయితే, సదరు వ్యక్తి వివరాలను ప్రభుత్వానికి వెంటనే చేరుస్తుంది. ఫోన్ లొకేషన్‌ను ఉపయోగించుకోవడం ద్వారా ఈ యాప్ తగిన సమాచారం అందిస్తుంది. ఈ యాప్‌లో యూజర్ డేటా కేవలం కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే పంచుకుంటారని, థర్డ్ పార్టీతో పంచుకోవడం ఉండదని, అందువల్ల ఇది సురక్షితం అని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఆరోగ్య సేతు యాప్ ని ఇలా ఇన్ స్టాల్ చేసుకోవాలి:
* ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్లు ప్లేస్టోర్‌లోకి వెళ్లి ‘ఆరోగ్య సేతు’ పేరు నమోదు చేసిన వెంటనే యాప్‌ కనిపిస్తుంది. సూచనల ఆధారంగా ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత ఓపెన్‌ చేయాలి.
* జీపీఎస్‌ ఆధారంగా లొకేషన్‌ ఎంపిక చేసుకున్నాక మొబైల్‌ నంబర్‌ వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
* ప్రస్తుతం 11 భాషల్లో యాప్‌ అందుబాటులో ఉంది. జీపీఎస్, బ్లూటూత్‌ నిరంతరం ఆన్‌లో ఉండాలి. అప్పుడే ఈ యాప్‌ కరోనా సమాచారం, స్థానిక వివరాలు అందిస్తుంది.
* ఈ యాప్‌ కరోనా బారిన పడ్డవారెవరైనా మీ సమీపంలోకి వస్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది.
* కరోనా వైరస్‌ దుష్ప్రభావాలను ఎలా గుర్తించాలో అవగాహన కల్పిస్తూనే సెల్ఫ్‌ ఐసోలేషన్‌ ఎలా పాటించాలో సూచిస్తుంది.

* కరోనాపై పోరాటంలో దేశ ప్రజలను ఏకం చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూపొందించిన యాప్ ఇది. వైరస్ సోకకుండా ప్రజలు జాగ్రత్త పడేందుకు ఈ యాప్‌ను రూపొందించారు. 
* దీన్ని వినియోగిస్తున్న వ్యక్తి ఇతరులతో కలిసి ఎంతవరకూ ఉన్నారో బ్లూటూత్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికతల సాయంతో ఈ యాప్ లెక్కగడుతుంది.
* మీరు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే, మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరి దగ్గర ఈ యాప్ ఉందో అది వెతుకుతుంది. ఎవరైనా కరోనావైరస్ సోకిన వ్యక్తి మీకు సమీపంలో నివసిస్తున్నారా అన్న విషయం చెబుతుంది. జీపీఎస్ ద్వారా మీరు ఆ ఆ వ్యక్తిని ఎప్పుడైనా కలిశారా అన్న విషయం కూడా కనిపెట్టి చెప్పే ప్రయత్నం చేస్తుంది.
* ఈ యాప్ 11 భాషల్లో అందుబాటులో ఉంది.
* పేరు, మొబైల్ నెంబర్, సెక్స్(లింగం), వృత్తి, ప్రయాణాల వివరాలు, స్మోకింగ్ అలవాటు ఉందో, లేదో లాంటి వివరాలను యాప్ వినియోగదారులను అడుగుతుంది.
* యాప్‌లో ఉన్న సమాచారాన్ని వినియోగించుకుని భారత ప్రభుత్వం కరోనావైరస్ సంబంధిత డేటాబేస్ తయారు చేస్తుంది. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దీన్ని ఉపయోగించుకుంటుంది.
* సమాచారమంతా క్లౌడ్ స్టోరేజీలో ఉంటుంది. కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించిన సూచనలు వినియోగదారులకు వస్తుంటాయి.
* కరోనావైరస్ మహమ్మారి నియంత్రణకు తప్ప మరే కారణానికీ ఇందులోని సమాచారాన్ని వినియోగించరు. ఎవరైనా వినియోగదారుడు యాప్ అన్ఇన్‌స్టాల్ చేస్తే, 30 రోజులకు క్లౌడ్ స్టోరేజీ నుంచి వారి సమాచారం డిలీట్ అయిపోతుంది.

* దక్షిణ కొరియాలో కరోనా కట్టడిలో కీ రోల్ ప్లే చేసిన కరోనా ట్రేసింగ్ యాప్.
* సొంత యాప్ లాంచ్ చేసిన యూకే.
* త్వరలోనే కరోనా ట్రాకింగ్ యాప్ లాంచ్ చేయనున్న ఫ్రాన్స్, అమెరికా
* సొంత కరోనా ట్రాకింగ్ యాప్ తీసుకొచ్చే పనిలో డబ్ల్యూహెచ్ వో

ఇప్పటికే అనేకమంది భారతీయులు ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకున్నారు. ఇంకా చేసుకోవాల్సిన వారు చాలామందే ఉన్నారు. ప్రతి ఒక్కరు విధిగా ఆరోగ్య సేతు యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. కరోనాపై యుద్ధంలో గెలవాలంటే ఈ యాప్ పాత్ర కీలకం అని చెబుతోంది. ఎలాంటి భయాలు, సందేహాలు, అనుమానాలు లేకుండా దీని ప్రాముఖ్యత తెలుసుకుని యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలని, అప్పుడే మానవాళి మనుగడకు సవాల్ విసురుతున్న మహమ్మారి అంతు చూడగలమని కేంద్రం అంటోంది.

Read: లాక్‌డౌన్ పొడిగించడం వల్ల ప్రయోజనం లేదు: ఆనంద్ మహీంద్రా