India Covid Cases : మళ్లీ కరోనా కలవరం.. దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, ప్రధాని కీలక సమావేశం
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేగింది. గడిచిన 2 వారాల్లో కేసుల సంఖ్య 260 శాతం మేర పెరిగింది.(India Covid Cases)

India Covid Cases : దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి కలకలం రేగింది. కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 2 వారాల్లో కేసుల సంఖ్య 260 శాతం మేర పెరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ తీవ్రతపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, హోంమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులు ఈ సమీక్షలో పాల్గొంటారు.
కేసులు పెరుగుతుండటంతో మరింతగా వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. గడిచిన వారంలో 2వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ పరిస్థితులు, ప్రజా ఆరోగ్య సంసిద్ధతపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు మోదీ. గడిచిన మూడేళ్లలో భారత్ లో కోవిడ్ వల్ల 5లక్షల 30వేల మంది చనిపోయారు.(India Covid Cases)
Also Read..Gujarat : డాక్టర్ల నిర్లక్ష్యం, రోగి కుటుంబానికి రూ.33 లక్షలు చెల్లించాలని ఆదేశం
దేశంలో మరోసారి కరోనా కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురిచేస్తోంది. కొన్నిరోజులుగా నిత్యం వెయ్యికి పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న 6 రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ బుధవారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మరోసారి కొవిడ్ తీవ్రరూపు దాల్చకుండా తీసుకోవాల్సిన చర్యలు, ప్రజారోగ్య వ్యవస్థలు సన్నద్ధమవ్వాల్సిన తీరుపై ప్రధాని మోదీ ఈ సమావేశంలో చర్చించనున్నారు.(India Covid Cases)
దేశంలో 24 గంటల్లో వెయ్యికి పైగా కరోనా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. 1,134 కోవిడ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా మరో ఐదుగురు కోవిడ్ తో మరణించారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 7,026 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొంతకాలంగా కరోనా మరణాలేవీ లేకపోగా, ఇటీవల మళ్లీ మరణాలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఛత్తీస్ గఢ్, కేరళ, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రలో ఒక్కో మరణం నమోదయ్యాయి.(India Covid Cases)
ఢిల్లీలో 83 కరోనా కేసులు వెలుగు చూశాయి. పాజిటివిటీ రేటు 5.83 శాతంగా నమోదైంది. కొన్ని రోజులుగా ఢిల్లీలో కొవిడ్ కేసులు పెరగడంతో పాటూ హెచ్3ఎన్2 కేసుల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది.
ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లల్లోని హెచ్3ఎన్2 సబ్‌టైప్ ఏ ఉపరకం వైరస్ కారణంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోందని భారత వైద్య పరిశోధన మండలి తెలిపింది. ఇతర ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ల కంటే హెచ్3ఎన్2 రకం కారణంగా కేసులు, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు విశ్లేషించింది. ఈ వైరస్ సోకిన వాళ్లల్లో ముక్కు కారడం, వదలని దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్లు వెల్లడించారు.(India Covid Cases)