COVID Crisis : మేలో కరోనా ప్రళయం, భారత్ లో రోజుకు 10 వేల కేసులు, ఐదు వేల మంది మృతి!

పది లక్షల కరోనా కేసులు...ఐదువేల కరోనా మరణాలు....ఇవి ఏ రాష్ట్రంలోనో, దేశంలోనో... మొత్తం కేసులో...నెలవారీ బాధితుల వివరాలో కాదు....మరో వారం రోజుల్లో భారత్‌లో ఒక్కరోజులో నమోదు కానున్న కేసుల సంఖ్య, మరణాల సంఖ్య.

COVID Crisis : మేలో కరోనా ప్రళయం, భారత్ లో రోజుకు 10 వేల కేసులు, ఐదు వేల మంది మృతి!

India covid

Michigan University : పది లక్షల కరోనా కేసులు…ఐదువేల కరోనా మరణాలు….ఇవి ఏ రాష్ట్రంలోనో, దేశంలోనో… మొత్తం కేసులో…నెలవారీ బాధితుల వివరాలో కాదు….మరో వారం రోజుల్లో భారత్‌లో ఒక్కరోజులో నమోదు కానున్న కేసుల సంఖ్య, మరణాల సంఖ్య. అవును…మే మొదటి వారానికి ప్రభుత్వం అధికారికంగా వెల్లడించే కరోనా లెక్కలే…భీతావహంగా ఉండనున్నాయి. రోజుకు 10 లక్షల మంది కొత్తగా కరోనా బారిన పడనున్నారు. 24 గంటల్లో ఐదువేలమందిని మహమ్మారి బలితీసుకోనుంది. ఒక్క మాటలో చెప్పాలంటే…మేలో మహా ప్రళయంలా వైరస్ విరుచుకుపడనుంది. మిచిగాన్ యూనివర్శిటీ అంటు వ్యాధుల విభాగం ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్‌ అండ్ ఎవాల్యుయేషన్ నమూనాలో ఆమె భారత్‌లో వైరస్ ఉధృతిని విశ్లేషించారు.

కరోనా కరాళ నృత్యంతో నెల రోజులుగా భారత్‌ అల్లకల్లోలమవుతోంది. రోజురోజుకీ పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలతో దేశాన్ని వైరస్ ఉపద్రవం ముంచెత్తింది. రోగుల ఆర్తనాదాలు, బంధువుల ఆక్రందనలు, ఆక్సిజన్ అందక, బెడ్లు లేక, చికిత్స జరగక అయిన వాళ్ల కళ్లముందే తుదిశ్వాస విడుస్తున్న కరోనా బాధితులు…వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానాల్లో చోటు దరకని హృదయ విదారక పరిస్థితులతో భారత్‌ కరోనా విషాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దేశంలో వల్లకాటి అధ్వాన్న శకం నడుస్తోంది. రోగులు, వారి బంధువులే కాదు…దేశంలోని ప్రతి పౌరుడూ…కరోనా పేరు చెబితే ఉలిక్కిపడుతున్నాడు. భారతీయులంతా దినమొకగండంగా బతుకు వెళ్లదీస్తున్నారు.

కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందన్న వార్త కోసం రోజులు లెక్కబెట్టుకుంటూ ప్రతిక్షణం ఎదురుచూస్తున్నారు. కానీ ఆ ఆశలేవీ ఇప్పుడప్పుడే నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడున్న వైరస్‌ వ్యాప్తి తీవ్రతనే తట్టుకోలేక భారత ఆరోగ్య వ్యవస్థ చేతులేత్తేస్తే….ఈ అధ్యయనాలు మాత్రం మరింత తీవ్రస్థాయి ముప్పు భారత్‌కు ముంచుకొస్తోందని హెచ్చరిస్తున్నాయి. మే 11 నుంచి 15 మధ్య కరోనా వ్యాప్తి దేశంలో అతితీవ్ర స్థాయికి చేరుతుందని ఇప్పటికే ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు అంచనా వేస్తే…మిచిగాన్ శాస్త్రవేత్తలు మరింత అధ్వాన్న స్థితి దాపురించనుందని చెబుతున్నారు.

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3 లక్షల 46 వేల 786 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక్కరోజులో 2,624 మందిని వైరస్‌ బలితీసుకుంది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 25 లక్షలకు చేరింది. అన్ని ప్రాంతాల్లో టెస్టుల సంఖ్య పెరిగింది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా రోజుకు 15లక్షలకు పైగా టెస్టులు నిర్వహిస్తున్నారు. నెల రోజుల క్రితం 4.2శాతంగా ఉన్న కరోనా పాజిటివిటీ రేటు ఇప్పుడు 18.4శాతంగా ఉంది. అయితే అధికారిక లెక్కలు ఇలా ఉన్నప్పటికీ వాస్తవానికి పరిస్థితి మాటల్లో చెప్పలేనంత భయానకంగా ఉందని మిచిగాన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ అంటున్నారు.

వైరస్ వ్యాప్తి ఊహించని రీతిలో ఉంటుందని…మరో రెండు వారాలకు పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుందని ఆమె హెచ్చరించారు. మే మధ్య నాటికి భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 45 లక్షలకు చేరవచ్చని ఆమె అంచనావేశారు. ఉపద్రవం మరింతగా విరుచుకుపడితే..ఆ సంఖ్య 50లక్షలకూ చేరే ప్రమాదముందన్నారు. కరోనా తీవ్రస్థాయికి చేరిన తర్వాత నెమ్మదిగా తగ్గుముఖం పడుతుందని…ఆగస్టు నాటికి వైరస్ తీవ్రత తగ్గే అవకాశముందని భ్రమర్ ముఖర్జీ తెలిపారు. వైరస్ జీనోమ్ విశ్లేషణ పెంచడం, వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో వేగం పెంచడం, ఆక్సిజన్ సరఫరాకు చర్యలు తీసుకోవడం ద్వారా…సాధారణ జనజీవనం ఏర్పడే అవకాశముందన్నారు.

Read More : Covid in Madhya Pradesh: అంబులెన్స్ నుంచి ఎగిరి రోడ్డుపై పడిన కరోనా డెడ్ బాడీ!