కరోనా ఎఫెక్ట్ : ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వేశాఖ 

  • Published By: chvmurthy ,Published On : March 17, 2020 / 01:38 PM IST
కరోనా ఎఫెక్ట్ : ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వేశాఖ 

దేశంలో కోవిడ్‌-19(కరోనా వైరస్‌) వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి కప్పుడూ రాష్ట్రాలను అలర్ట్ చేస్తూనే ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి.. జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే షాపింగ్‌ మాల్స్‌, పబ్లిక్‌ పార్కులు మూసివేశారు.

అదే విధంగా వివాహ వేడుకలను కూడా వాయిదా వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను  కోరుతున్నాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి కట్టడి చేసే చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా  కొన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్టు ధరను రూ. 10 నుంచి రూ. 50కి పెంచింది.

 ‘‘దేశంలోని 250 రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను రూ. 10 నుంచి రూ. 50కి పెంచుతున్నట్లు రేల్వే శాఖ  సీనియర్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇది తాత్కాలికమేనని….అనవసరంగా ఫ్రజలు రైల్వే స్టేషన్ కు రాకుండా… రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.

పశ్చిమ రైల్వే ముంబై, వడోదర, అహ్మదాబాద్‌, రట్లాం, రాజ్‌కోట్‌, భావ్‌నగర్‌ స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను రూ.50కి పెంచింది’’ అని పేర్కొన్నారు. రైల్వే ప్లాట్‌ఫాం టికెట్  ధరను పెంచేందుకు 2015 మార్చిలో డివిజన్‌ రైల్వే మేనేజర్లకు అధికారం ఇస్తూ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఇదిలా ఉండగా.. మంగళవారం భారతదేశంలో కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 126కు చేరింది. ఇక ఈ ప్రాణాంతక వైరస్‌ కారణంగా దేశంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.