భారత్‌లో ఏప్రిల్-జూన్‌లో ఓపెన్ మార్కెట్లోకి కోవిడ్ టీకాలు..!

భారత్‌లో ఏప్రిల్-జూన్‌లో ఓపెన్ మార్కెట్లోకి కోవిడ్ టీకాలు..!

Covid Jabs Open Market April And June : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ మహమ్మారిని అంతంచేసే వ్యాక్సిన్లు అందరికి అందుబాటులోకి ఒక్కొక్కటిగా వస్తున్నాయి. భారతదేశంలోని ఓపెన్ మార్కెట్లో కోవిడ్-19 వ్యాక్సిన్‌లను ఏప్రిల్ నుంచి జూన్ మధ్యనెలల్లో అందుబాటులో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ ధరలను నియంత్రించే అవకాశం ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్రాలు గుర్తించిన ప్రాధాన్యత గ్రూపులు మాత్రమే కాకుండా, టీకా కొనే ప్రైవేట్ పౌరులను కూడా వ్యాక్సిన్ వేయడానికి ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మల్టీ వ్యాక్సిన్ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది.

జనవరి చివరి నాటికి కనీసం ఒక వ్యాక్సిన్‌ను ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. టీకాలు మొదట్లో పరిమిత పరిమాణంలో మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. ప్రజా రోగనిరోధకత ప్రాధాన్యత గ్రూపులతోనే వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మార్చి-ఏప్రిల్ నాటికి మరిన్ని వ్యాక్సిన్లు ఆమోదించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. జాతీయ టీకా కార్యక్రమానికి బయట కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. ఫేజ్-3 ట్రయల్స్‌లో నాలుగు డ్రగ్ మేకర్లు భారత మల్టీ వ్యాక్సిన్ వ్యూహాన్ని వినియోగించుకోనున్నాయి. టీకాలకు ఆమోదం లభించిన వెంటనే అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రారంభంలో టీకాల పంపిణీ సవాలుగా మారనుంది.

అందుకే ప్రభుత్వం వినియోగానికి ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉందని అధికారి ఒకరు చెప్పారు. ప్రభుత్వం ప్రాధాన్యత లక్ష్యాలను చేరుకున్న తర్వాత పబ్లిక్ ఇమ్యునైజేషన్ వెలుపల ప్రైవేట్ కొనుగోలుకు ఈ టీకాలు అందుబాటులో ఉంటాయని, ఏప్రిల్-జూన్ మధ్య నెలల్లో జరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో 5 వ్యాక్సిన్లు హ్యుమన్ ట్రయల్స్ లో ఉన్నాయి. సీరం (ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ ), భారత్ బయోటెక్ (కోవాక్సిన్, ICMR), డాక్టర్ రెడ్డి / RDIF (స్పుత్నిక్-V) జైడస్ కాడిలా అనే నాలుగు కంపెనీల టీకాలు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. మార్చి నాటికి, ట్రయల్స్ విజయవంతమైతే.. ఇండియాలో మొత్తం 500 మిలియన్ల వరకు డోస్‌లు రెడీ అయినట్టే.

బయోఎంటెక్‌తో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు యుఎస్ రెగ్యులేటరీ అథారిటీ ఆధారంగా ఫైజర్ భారతదేశంలో మార్కెటింగ్ ఆమోదం కోసం దరఖాస్తు చేసింది. టీకాలకు బహిరంగ మార్కెట్లో ఎంత ధర ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. టీకా ఖర్చుల్లో ఎక్కువ మొత్తాన్ని కేంద్రమే భరించవచ్చునని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆమోదించిన వ్యాక్సిన్ ప్రకారం ధర మారుతుంది. కానీ, బహిరంగ మార్కెట్లో ధరను ప్రభుత్వం నియంత్రించే అవకాశం ఉందని అధికారి ఒకరు వెల్లడించారు.