Covid Second Wave : రాబోయే 2 నెలలు జాగ్రత్త.. కేంద్రం తాజా హెచ్చరిక

దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విజృంభించింది. ఒక్కసారిగా కొత్త కేసులు భారీగా పెరిగాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ కు సంబంధించి తాజా హెచ్చరిక చేసింది.

Covid Second Wave : రాబోయే 2 నెలలు జాగ్రత్త.. కేంద్రం తాజా హెచ్చరిక

Covid Second Wave

Covid Second Wave : దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విజృంభించింది. ఒక్కసారిగా కొత్త కేసులు భారీగా పెరిగాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ కు సంబంధించి తాజా హెచ్చరిక చేసింది. గత 24 గంటల్లో దేశంలో 46వేల కరోనా కేసులు నమోదయ్యాయని, దాదాపు 60శాతం కేసులు కేరళలోనే వచ్చాయంది. ఇతర రాష్ట్రాల్లో కేసులు తగ్గుతున్నాయంది. కాగా, దేశంలో కరోనా సెకండ్ వేవ్ మధ్యలో ఉందని చెప్పింది. పండుగల నేపథ్యంలో రానున్న రెండు నెలలు అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలంది. టీకా ద్వారా కరోనా నుంచి రక్షణ పొందవచ్చన్న కేంద్రం.. టీకా తీసుకున్నా మాస్కులు తప్పనిసరిగా ధరించాలంది.

”కరోనా సెకండ్ వేవ్ ఇంకా అయిపోలేదు. కొవిడ్ ముప్పు ముగిసిపోలేదు. ప్రజలు పండుగలను జాగ్రత్తలతో జరుపుకోవాలి. మహమ్మారి నిర్వహణలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల చాలా కీలకం” అని కేంద్రం చెప్పింది.

దేశం ఇప్పటికీ కోవిడ్ సెకెండ్ వేవ్ మధ్యలోనే ఉందని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పలు పండుగలు ఉన్నందున ఆ రెండు నెలలు చాలా కీలకమవుతాయని చెప్పారు. కోవిడ్ నియమ నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కోవిడ్ వ్యాక్సిన్లు వ్యాధిని తగ్గిస్తాయే కానీ వ్యాధిని నిరోధించవని, వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని చెప్పారు.

కాగా, కేరళలో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. గత వారంలో నమోదైన మొత్తం కేసుల్లో 58.4 శాతం కేసులు కేరళలోనే నమోదయ్యాయి. కేరళలో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్టు రాజేష్ భూషణ్ తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో 10వేల నుంచి లక్ష వరకూ యాక్టివ్ కేసులున్నట్టు చెప్పారు.

మొత్తం నమోదైన యాక్టివ్ కేసుల్లో 51 శాతం ఒక్క కేరళలోనే ఉండగా, మహారాష్ట్రలో 16 శాతం, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో తక్కిన శాతం ఉన్నట్టు తెలిపారు. దేశంలోని 41 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువ ఉందని చెప్పారు.

ఇది ఇలా ఉంటే, భారత్ లో కరోనా థర్డ్ వేవ్ టెన్షన్ మొదలైంది. కొత్త​ కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరగడమే ఇందుకు కారణం. ఇటీవల తగ్గుతూ వచ్చిన కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 46వేల 164 కొత్త కేసులు నమోదు కాగా 34వేల 159 మంది కోలుకున్నారు. మరో 607 మంది వైరస్‌ బారినపడి కన్నుమూశారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.25 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు 3.17 కోట్ల మంది కోలుకున్నారు. వైరస్‌ ప్రభావంతో మొత్తం 4లక్షల 36వేల 365 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 3లక్షల 33వేల 725 ఉంది.

కాగా కొత్తగా నమోదైన కేసుల్లో 31 వేల కేసులు ఒక్క కేరళలోనే వెలుగుచూడటం ఆందోళనకు గురి చేస్తోంది. ఆ రాష్ట్రంలో వైరస్ తీవ్రత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కలవరపెడుతోంది. అంటే దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఏకంగా 68 శాతం కేసులు కేరళలోనే నమోదయ్యాయి. ఓనం పండగ తర్వాత భారీగా కేసులు వెలుగుచూస్తున్నాయి. కేరళ తర్వాత మహారాష్ట్రలో ఎక్కువ పాజిటివ్ కేసులు (5,031) నమోదవుతున్నాయి.

మొత్తం కేసులు: 3,25,58,530
మొత్తం మరణాలు: 4,36,365
మొత్తం కోలుకున్న వారు: 3,17,88,440
యాక్టివ్ కేసులు: 3,33,725

మరోవైపు అక్టోబర్ లో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని.. చిన్నపిల్లలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందన్న వైద్య నిపుణలు హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.