Covid Second Wave : దేశాన్ని వణికిస్తున్న కరోనా సెకెండ్‌ వేవ్‌!

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 89వేల 129 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక 714 మందిని వైరస్‌ బలితీసుకుంది.

Covid Second Wave : దేశాన్ని వణికిస్తున్న కరోనా సెకెండ్‌ వేవ్‌!

Covid Second Wave Peak In India

Covid Second Wave peak in India : కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 89వేల 129 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక 714 మందిని వైరస్‌ బలితీసుకుంది. ఇన్నాళ్లూ ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాలుగా అమెరికా, బ్రెజిల్‌ ఉండేవి. కానీ.. ఇప్పుడు భారత్‌ వాటిని వెనక్కు నెట్టింది. అమెరికా, బ్రెజిల్‌లో 24గంటల్లో 69వేలకు పైగా కేసులు వస్తే మన దగ్గర ఏకంగా 89వేల మందికి పాజిటివ్‌గా తేలింది. మహారాష్ట్రలో అడ్డూ అదుపూ లేకుండా కేసులు పెరుగుతున్నాయి.

24గంటల్లోనే 47వేల 827 కేసులు వచ్చాయి. బ్రెజిల్‌, అమెరికాల తర్వాత మిగిలిన అన్ని దేశాల కంటే ఒక్క మహారాష్ట్రలోనే ఎక్కువ కేసులు వస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న కేసుల సంఖ్య చూస్తుంటే… మహారాష్ట్రలో మరోసారి లాక్‌డౌన్ తప్పని పరిస్థితి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కరోనా కేసులు, మరణాల్లో సగం వాటా మహారాష్ట్రవే. చత్తీస్‌గఢ్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీల్లోనూ కేసుల తీవ్రత ఎక్కువగానే కనిపిస్తోంది.

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ మార్చిలో ప్రారంభమైనట్లు గుర్తించారు. ఈనెల రెండో వారం తర్వాత కేసుల సంఖ్య గరిష్ట స్థాయిని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంటే రోజుకు కేసుల సంఖ్య లక్ష దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. తొలి దశలో కూడా ఎప్పుడూ ఇన్ని కేసులు రాలేదు. మే చివరి దాకా కరోనా ఉధృతి సాగి ఆ తర్వాత కాస్త తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్‌ తన ప్రతాపం చూపుతోంది.

గడచిన 24 గంటల్లో వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 7 వేలకు చేరువైంది. కొత్తగా 1,078 మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్న కరోనాతో ఆరుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1712కి చేరింది. ఏపీలోనూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా 24 గంటల్లో 1398 కేసులు కొత్తగా నమోదయ్యాయి.