భారత కంపెనీ అంటే చులకనైపోయిందా : “కోవాగ్జిన్” విమర్శలపై భారత్ బయోటెక్ చైర్మన్

భారత కంపెనీ అంటే చులకనైపోయిందా : “కోవాగ్జిన్” విమర్శలపై భారత్ బయోటెక్ చైర్మన్

Covid vaccine కరోనా కట్టడికోసం.. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికాతో కలిసి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్‌కు, హైదరాబాద్ ప్రధానకేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ కంపెనీ..ఐసీఎంఆర్ సహకారంతో అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ కు దేశంలో అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆదివారం ఉదయం అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే భారత్ బయోటెక్ వ్యాక్సిన్ “కోవాగ్జిన్”అత్యవసర వినియోగానికి అనుమతివ్వడంపై విపక్షాలు ఫైర్ అయ్యాయి.

కోవాగ్జిన్ పై విప‌క్షాలు అనుమానాలు వ్య‌క్తం చేశాయి. ఎటువంటి డేటా ఇవ్వ‌కుండా కోవాగ్జిన్ టీకాకు ఎలా అనుమ‌తి ఇస్తార‌ని విపక్షాలు నిల‌దీశాయి. విపక్షాల విమర్శలు,అనుమానాల నేపథ్యంలో సోమవారం(జనవరి-4,2021)భార‌త్‌బ‌యోటెక్ సంస్థ చైర్మ‌న్ డాక్టర్ ఎల్లా కృష్ణ(51)మీడియాతో మాట్లాడారు. ముందుగా కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతివ్వడం పట్ల డాక్టర్ కృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు, వాలంటీర్లకు ఈ విజయం అంకితం అని అన్నారు.

కోవాగ్జిన్ పై రాజకీయాలు చేయోద్దన్నారు. త‌మ సంస్థ‌కు అనుభ‌వం లేద‌ని ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాదని డాక్టర్ ఎల్లా కృష్ణా అన్నారు. తాము ఫైజర్ కంటే తక్కువ కాదని భారత్ బయోటెక్ సీఎండీ చెప్పారు. కొవాగ్జిన్ సురక్షితమైన ఇనాక్టివేటెడ్‌ వ్యాక్సిన్‌ అని అన్నారు. కొవాగ్జిన్‌పై అన్ని కమిటీలకు పారదర్శకమైన సమాచారం ఇచ్చామన్నారు. డేటా అంశంలో పార‌ద‌ర్శ‌కంగా లేమ‌ని చెప్ప‌డం అస‌త్య‌మ‌ని ఆయ‌న అన్నారు. బ్రిటన్ సహా 12 దేశాల్లో కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు తెలిపారు. కేవ‌లం భార‌త్‌లో మాత్ర‌మే త‌మ టీకాల‌ను వాడ‌ర‌న్నారు. వ్యాక్సిన్ల విషయంలో తమకు గ్లోబల్‌ లీడర్‌షిప్‌ ఉందన్నారు.

భారత్‌ బయోటెక్‌ భారత్‌కే పరిమితమైన కంపెనీ కాదని.. తమది గ్లోబల్‌ కంపెనీ అని..ఇప్ప‌టికే అనేక ర‌కాల వ్యాక్సిన్ల‌ను త‌యారు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. త‌మ కంపెనీ ఇప్ప‌టి వ‌ర‌కు 16 ర‌కాల టీకాల‌ను త‌యారు చేసిన‌ట్లు కృష్ణ ఎల్లా చెప్పారు. చికున్ గున్యా సహా అనేక వ్యాధులకు తాము వ్యాక్సిన్లు తయారు చేశామన్నారు. గతంలో తక్కువ మందిపై ప్రయోగాలు చేసిన విదేశీ కంపెనీలు అనుమతులు పొందాయన్నారు. భారత్‌ బయోటెక్‌ ఇప్పటివరకు 5 పబ్లికేషన్లు ఇచ్చిందని తెలిపారు.

భారతీయ కంపెనీలను తప్పుబట్టే ధోరణి ఉన్నందున కోవాక్సిన్ విమర్శలను ఎదుర్కొంటున్నట్లు డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. భారతీయ కంపెనీలపై చాలా ఎదురుదెబ్బలు ఉన్నాయి. ఇది మాకు ఆమోదయోగ్యం కాదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ భారతీయ కంపెనీలను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారో నాకు తెలియదు అని ఆయన అన్నారు.

వాస్త‌వానికి కోవాగ్జిన్ మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి. కానీ ఆ టీకాను స‌డ‌న్‌గా అనుమ‌తి ఇవ్వ‌డం ప‌ట్ల వివాదం అయ్యింది. ఈ నేప‌థ్యంలో వివ‌ర‌ణ ఇచ్చిన చైర్మ‌న్ ఎల్లా కృష్ణ.. భారత్‌ బయోటెక్‌కు అనేక దేశాల్లో భాగస్వాములు ఉన్నారని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత జర్నల్స్‌లో భారత్‌ బయోటెక్‌పై వ్యాసాలు వచ్చాయన్నారు.ప్రస్తుతం 123 దేశాలకు తాము సేవలు అందిస్తున్నామని డాక్టర్ కృష్ణ తెలిపారు