భారత్‌లో మొదట కరోనా వ్యాక్సిన్ ఇచ్చేది వాళ్ళకే

  • Published By: venkaiahnaidu ,Published On : August 16, 2020 / 05:34 PM IST
భారత్‌లో మొదట కరోనా వ్యాక్సిన్ ఇచ్చేది వాళ్ళకే

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇటీవల రష్యా మొదటిసారిగా కరోనా వ్యాక్సిన్‌ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.



భారత్‌లో కూడా సైంటిస్టులు కరోనా వ్యాక్సిన్ రెడీ చేసే పనిలో ఉన్నారు. భారత్ బయోటెక్ కంపెనీ కోవాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే, భారత్‌లో కరోనా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే తొలిసారిగా కరోనా వారియర్స్‌కే దాన్ని అందిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే తెలిపారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట దగ్గర రిపోర్టర్లతో ముచ్చటించిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఎర్రకోట సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను అశ్విని కుమార్ చౌబే స్వాగతించారు. వైద్య ఆరోగ్య రంగంలో ఇది సమూల మార్పులు తీసుకొస్తుందని అయన అన్నారు.



మరోవైపు,రష్యా కరోనా వ్యాక్సిన్ “స్పుత్నిక్-వి” కోసం ఎలాంటి టెక్నాలజీని వాడిందో తెలుసుకోవాలనే ఆలోచన అన్ని దేశాల్లో మొదలైంది.. ఇతర దేశాల మాదిరిగానే.. భారతీయ కంపెనీలు కూడా స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్ సంబంధించి ఫేజ్-1, ఫేజ్-2 సాంకేతికసమాచారం కోరాయి. వ్యాక్సిన్ దేశీయ ఉత్పత్తికి, ఎగుమతికి కూడా భారతీయ కంపెనీలు రష్యా అనుమతి కోరినట్లు సమాచారం. . దీనిపై రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (RDIF)తో చర్చించినట్లు తెలిసింది.