భారత్ లో కరోనా వ్యాక్సిన్ “కోవిషీల్డ్” కు గ్రీన్ సిగ్నల్

భారత్ లో కరోనా వ్యాక్సిన్ “కోవిషీల్డ్” కు గ్రీన్ సిగ్నల్

COVISHIELD VACCINE కరోనా మహమ్మారితో ఇబ్బంది పడుతున్న ప్రజలు వ్యాక్సిన్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు అనుకూలంగా ఇవాళ భారత్ లో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. కరోనా కట్టడికోసం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనికా కంపెనీ అభివృద్ధి చేసిన “కోవిషీల్డ్” వ్యాక్సిన్ ను భారత్ లో అత్యవసర వినియోగానికి కేంద్ర నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ ఈ రోజు ఢిల్లీలో సమావేశమైంది. ఐదు గంటల పాటు చర్చించింది. కరోనాకు సంబంధించి ఏ వ్యాక్సిన్‌కు అనుమతి ఇవ్వాలనేదానిపై చర్చించింది. వ్యాక్సిన్‌ సామర్థ్యం, ఎంత సమర్థంగా పనిచేస్తుంది? ఇతరత్రా అంశాలను పరిశీలించి చివరకు కోవిషీల్డ్‌కు అనుమతి ఇచ్చింది.

నిపుణుల కమిటీ రూపొందించిన నివేదికకు డీజీసీఐ అనుమతి ఇచ్చిన వెంటనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. ఈ వారంలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. భారత్ లో మొదటగా అందుబాటులోకి రానున్న కరోనా వ్యాక్సిన్ గా “కోవిషీల్డ్” నిలవనుంది.

కాగా, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(SII)భారత్ లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 7.5 కోట్ల డోసులను సీరం సంస్థ సిద్దం చేసింది. భారత ప్రభుత్వానికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కో డోసుని రూ.440కు అందిస్తుంది సీరం ఇన్‌స్టిట్యూట్. అదే, బహిరంగ మార్కెట్‌లో ఈ ధర రూ.700 నుంచి రూ.800 వరకు ఉండొచ్చని తెలిపింది.

అయితే,మిగతా వ్యాక్సిన్ లలా కాకుండా, ఆక్స్ ఫర్డ్ సహకారంతో బ్రిటన్ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఆస్ట్రాజెనికా కంపెనీ డెలవప్ చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను.. కేవలం సాధారణ రిఫ్రిజిరేటర్ల(2నుంచి 8డిగ్రీలు) వద్ద నిల్వ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఉష్ణోగ్రత వద్ద దీన్ని ఆరునెలలపాటు నిల్వ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. దీంతో మారుమూల ప్రాంతాలకు కూడా సులభంగా సరఫరా చేసే ఆస్కారం ఉంది.

మరోవైపు రేపు(జనవరి-2,2021) దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్​ నిర్వహించేందుకు కేంద్రం రెడీ అయింది.అన్ని రాష్ట్రాల రాజధానుల్లో క‌నీసం మూడు ప్రాంతాల్లో ఈ డ్రైన్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేంద్రం పేర్కొన్న‌ది. కొన్ని రాష్ట్రాల్లో జిల్లా కేంద్రాల్లోనూ టీకా పంపిణీ చేయ‌నున్నారు.. డ్రై ర‌న్‌లో భాగంగా డమ్మీ క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వ‌నున్నారు. పంపిణీ కార్య‌క్ర‌మంలో ఎదుర‌య్యే లోపాల‌ను అధిగ‌మించేందుకు ఈ ప్ర‌క్రియ తోడ్ప‌డ‌నున్న‌ది.

కాగా, ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్​ నిర్వహించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. గత నెల 28-29 తేదీలలో పంజాబ్, అసోం, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్​ పంపిణీలో భాగంగా నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన డ్రై రన్​ విజయవంతమైనట్లు ప్రకటించింది కేంద్రం. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్​ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.