Allahabad HC: జాతీయ జంతువుగా ఆవు.. కేంద్రానికి హైకోర్టు సూచన

హిందువులు భక్తి భావంతో లక్ష్మి దేవిగా పూజించే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని చాలారోజులుగా డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పలు రాజకీయ పార్టీలు..

Allahabad HC: జాతీయ జంతువుగా ఆవు.. కేంద్రానికి హైకోర్టు సూచన

Allahabad Hc

Allahabad HC: హిందువులు భక్తి భావంతో లక్ష్మి దేవిగా పూజించే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని చాలారోజులుగా డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పలు రాజకీయ పార్టీలు ఇదే ఎజెండాను కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే, తొలిసారి న్యాయస్థానం కూడా ఇదే అంశంపై సానుకూలంగా స్పందించింది.  ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలనీ కేంద్ర ప్రభుత్వానికి అలహాబాద్ హైకోర్టు సూచించింది. దీంతో మరోసారి ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చగా మారింది.

గోవధ కేసులో నిందితుడైన జావేద్ బెయిల్ పిటిషన్‌ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గోవధ చట్టాన్ని ఉల్లంఘించిన జావేద్‌‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు.. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సందర్భంలో హైకోర్టు పలు సూచనలు చేసింది. ఆవులను మతపరమైన కోణంలో మాత్రమే చూడరాదని.. ఆవును గౌరవించడం, రక్షించడం భారత జాతి విధి అని కూడా వ్యాఖ్యానించింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడంతోపాటు గోసంరక్షణను హిందువుల ప్రాథమిక హక్కుగా చేయాలని సూచించింది.

ఆవులకు జాతీయ జంతువు హోదా ఇవ్వడానికి కేంద్రం ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు తీసుకురావాలని.. దేశంలో ఆవులు సంతోషంగా ఉన్నప్పుడే దేశం కూడా సంతోషంగా ఉంటుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. భారతీయ సంస్కృతిలో ఆవు ఎంతో ముఖ్యమైనదని .. ఆవుకు సంబంధించి పార్లమెంట్ చేసిన చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని తెలిపింది. గతంలో రాజస్థాన్ హైకోర్టు కూడా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించగా.. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు కూడా ఇదే సూచనలు చేసింది. ఇక, దేశంలోని పలు రాష్ట్రాలు గోవధను నిషేధిస్తూ చట్టాలు చేయగా.. మరికొన్ని రాష్ట్రాలు ఆ దిశగా ఆలోచన చేస్తున్నాయి.