కేరళ ఎన్నికలు : సీపీఎం అభ్యర్థుల లిస్ట్ రిలీజ్..33 ఎమ్మెల్యేలు,5మంత్రులకు దక్కని చోటు

కేరళ ఎన్నికలు : సీపీఎం అభ్యర్థుల లిస్ట్ రిలీజ్..33 ఎమ్మెల్యేలు,5మంత్రులకు దక్కని చోటు

kerala elections కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం బుధవారం(మార్చి-10,2021)సీపీఎం పార్టీ అభ్య‌ర్థుల జాబితాను రిలీజ్ చేసింది. 83 మంది అభ్య‌ర్థుల‌తో తొలి లిస్టును సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఏ విజ‌య‌రాఘ‌వ‌న్ విడుదల చేశారు. ఎల్‌డీఎఫ్ ప్ర‌భుత్వ అభివృద్ధి ప‌నుల‌ను దృష్టిలో పెట్టుకుని జాబితాను త‌యారు చేసిన‌ట్లు విజ‌య‌రాఘ‌వ‌న్ తెలిపారు.

గత ఎన్నికల్లో సీపీఎం 92 స్థానాల్లో పోటీ చేయగా ఈసారి 85 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నట్లు తెలిపారు. మంజీశ్వ‌రం, దేవీకుల‌మ్ స్థానాల‌కు త్వరలోనే పేర్ల‌ను ప్ర‌క‌టించ‌నున్నట్లు చెప్పారు. కూట‌మి అభ్య‌ర్థుల కోసమే ఈసారి సీపీఎం ఏడు సీట్ల‌ను వ‌దులుకున్న‌ట్లు చెప్పారు. దాంట్లో అయిదు సిట్టింగ్ స్థానాలు ఉన్నాయన్నారు

ఇవాళ ప్ర‌క‌టించిన 83 మందిలో 74 మంది సీపీఎంకు చెందిన‌వారు కాగా మ‌రో 9 మంది ఆ పార్టీ మ‌ద్ద‌తు ఉన్న‌వారు పోటీచేయ‌నున్నారు. సీపీఎం త‌మ అభ్య‌ర్థుల్లో 11 మంది మ‌హిళ‌ల‌కు స్థానం క‌ల్పించారు. అయితే, ఇటీవల సీపీఎం పార్టీ ప్రవేశపెట్టిన “టూ-టర్మ్( రెండు, అంతకంటే ఎక్కువసార్లు పోటీచేసిన వారికి ఈసారి అవకాశం లేదు)” నిబంధనల వల్ల ఐదుగురు కేబినెట్ మంత్రులు,33మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ లభించలేదు. ఇక, సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ ఈసారి ధ‌ర్మ‌దం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్నారు. మంత్రి కేకే శైల‌జా..మ‌ట్ట‌న్నూర్‌, త‌వ‌నూర్ నుంచి కేటీ జ‌లీల్ పోటీ చేయ‌నున్నారు.

140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్-6న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ – సీ ఓటర్ తాజాగా చేపట్టిన ప్రీ పోల్ సర్వే అంచనా వేసింది. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 91 స్థానాల్లో గెలుపొందిన ఎల్డీఎఫ్‌ కూటమి.. ఈసారి 82సీట్లు సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇక, 2016 ఎన్నికల్లో 47 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమి ఈసారి కొద్దిమేరకు పుంజుకొని 56 సీట్లను సాధించే అవకాశం ఉన్నట్టు తెలిపింది. కేరళలో సీఎం అభ్యర్థిని సైతం ప్రకటించిన బీజేపీ పరిస్థితి ఏ మాత్రం మెరుగు పడదని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే చెబుతోంది. గతంలో గెలిచిన ఒక్క స్థానానికే బీజేపీ పరిమితమవుతుందని సర్వే పేర్కొంది.