Uttarakhand: ఉత్తరాఖండ్‌లో 561 ఇళ్లకు పగుళ్లు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ పట్టణంలో కొండచరియలు విరిగిపడటంతో పాటు, భూమి కుంగిపోతుండటంతో ఇళ్లకు బీటలు వారుతున్నాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో 561 ఇళ్లకుపైగా బీటలు వారినట్లు అధికారులు గుర్తించారు. 3వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో 561 ఇళ్లకు పగుళ్లు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు

UttaraKhand

Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లా జోషిమఠ్ పట్టణంలో కొండచరియలు విరిగిపడటం, భూమి కుంగిపోవడంతో వందలాది ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. నివాసితులు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. శీతాకాలపు వాతావరణం, కొండచరియలు విరిగి పడంటంవల్ల ఇల్లు కూలిపోతుండటంతో పట్టణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ముఖ్యంగా జోషిమఠ్ నగరంలోని తొమ్మిది వార్డులు కొండచరియలు విరిగిపడటంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి.

 

 

నగరంలో ఇళ్లకు పగుళ్లు రావటం, కూలిపోవటం వంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందేమోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండగా, ఇప్పటికే 561 ఇళ్లకు పగుళ్లు వచ్చాయని, 3వేల మంది ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చిందని మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ శైలేంద్ర పవార్ తెలిపారు. మర్వాడీలోని జేపీ కాలనీలో భూగర్భంలో నుంచి నీరు ఉబికి వస్తుంది. స్థానిక అధికారులు బీటలతో దెబ్బతింటున్న ఇళ్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారని, చాలా మంది తమ సొంత నివాసాలను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతానికి వెళ్లినట్లు ఆయన తెలిపారు.

 

 

ఇదిలాఉంటే.. ఇళ్లకు బీటలు వారుతున్న నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సహాయసహకారాలు అందించాలని సీఎం పుష్కర్ సింగ్ ధామి అధికారులకు సూచించారు. మరోవైపు పట్టణంలో అనేక ఇళ్లు భారీగా పగుళ్లు ఏర్పడటంతో రాత్రి సమయంలో స్థానిక ప్రజలు డీటీ (వెలుతురు కోసం కర్రలకు నిప్పంటించి)లతో వీధుల్లోకి వచ్చారు.