CRPF introduces CSRV : భారత సైనికుల కోసం బుల్లెట్‌ ప్రూఫ్‌ బుల్‌డోజర్లు.. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా

ఉగ్రమూకల ఆటలు కట్టించటానికి ప్రత్యేక బుల్డోజర్లు వచ్చేశాయి. భారత సైనికులకు ప్రత్యేక బుల్డోజర్లను అప్పగించింది ఆర్మీ. ఉగ్రవాదులు దాక్కున్న ఇళ్ల నుంచి వారిని తరిమికొట్టేందుకు ఈ బుల్‌డోజర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. బుల్లెట్ ప్రూఫ్ బుల్డోజర్లతో ఇక ఉగ్రమూకల ఆటకట్టించేలా వీటి నిర్మాణం ఉంది.

CRPF introduces CSRV : భారత సైనికుల కోసం బుల్లెట్‌ ప్రూఫ్‌ బుల్‌డోజర్లు.. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా

CRPF introduces CSRV

CRPF introduces CSRV : భారత సరిహద్దుల్లో కంటిమీద రెప్ప వేయకుండా గస్తీ కాస్తూ ఉగ్రవాదుల నీడ పడినా బుల్లెట్ల వర్షంతో విరుచుకపడే భారత జవాన్ల దేశభక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. భార్యా పిల్లలను,కుటుంబాలకు దూరంగా దేశ సరిహద్దుల్లో కావలి కాసే జవాన్లు ఉగ్రవాదుల భరతం పడుతుంటారు. దేశం వైపు కన్నెత్తి చూస్తే చాలు ఖతం చేసేస్తారు. అటువంటి భారత జవాన్లకు ఎన్నో అత్యాధునికి ఆయుధాలున్నా ఉగ్రవాదుల గురి భారత్ పైనే ఉంటుంది. అవకాశం దొరికితే చాలు విరుచుపడి మారణహోమానికి తెగబడుతుంటారు. ఉగ్రవాదుల్ని ఎదుర్కొనే పోరాటంలో భారత సైనికులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. అయినా ఉగ్రవాదుల్ని ఎదుర్కోవటానికి దేశాన్ని రక్షించుకోవటానికి మన సైనికులు పోరాడుతునే ఉన్నారు. ఆయుధాలతో సైన్యం విరుచుకుపడుతున్నా కొన్నిసార్లు ఉగ్రమూకలు తృటిలో తప్పించుకుంటాయి. మారణాయుధాలతో మారణహోమానికి పాల్పడుతుంటాయి. పౌరులను కూడా బలితీసుకుంటాయి.

కానీ ఇక ఉగ్రమూకల ఆటలు కట్టించటానికి ప్రత్యేక బుల్డోజర్లు వచ్చేశాయి. భారత సైనికులకు ప్రత్యేక బుల్డోజర్లను అప్పగించింది ఆర్మీ. ఉగ్రవాదులు దాక్కున్న ఇళ్ల నుంచి వారిని తరిమికొట్టేందుకు ఈ బుల్‌డోజర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. బుల్లెట్ ప్రూఫ్ బుల్డోజర్లతో ఇక ఉగ్రమూకల ఆటకట్టించేలా వీటి నిర్మాణం జరిగింది. ఈ హైటెక్‌ బుల్‌డోజర్లు ఆషామాషీగా ఉండవు. సైనికదళాలు సురక్షితంగా ఉండేందుకు వీటిలో బంకర్‌ కూడా ఉంది. జమ్ము కశ్మీర్‌లో సైనికులకు ఈ బుల్డోజర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ బుల్డోజర్లను బుల్లెట్లు, బాంబులు కూడా ఏమీ చేయలేవు.

ఈ బుల్డోజర్లకు యాంటీ టెర్రర్‌ బుల్‌డోజర్‌గా పేరు పెట్టారు. దీన్ని క్రైసిస్‌ సిచ్యూయేషన్‌ రెస్పాన్స్‌ వెహికిల్‌ లేదా CSRVఅని కూడా అంటారు. రెండు రకాల CSRV లను జమ్ము కశ్మీర్‌లోని భద్రతా బలగాలకు అప్పగించారు. ఒకటి పెద్దదిగా మరొకటి దానికంటే చిన్నది. చిన్న బుల్డోజర్ ని చిన్న చిన్న గల్లీల్లోకి కూడా తీసుకెళ్లవచ్చు. పెద్ద CSRV తయారీ కోసం పెద్ద JCBని మాడిఫై చేశారు. గ్రేడ్‌ 4 మెటల్‌తో దీన్ని రూపొందించారు.

దీంట్లో నలుగురు జవాన్లు, ఒక కమాండర్‌, ఒక ఆపరేటర్‌ కూర్చొవటానికి వీలుగా ఉంటుంది. ఉగ్రవాదులను మట్టుపెట్టేలా ఫైరింగ్‌ కోసం ప్రత్యేకమైన పాయింట్స్‌ ఏర్పాటు చేశారు. CSRV 180 నుంచి 360 డిగ్రీల వరకు తిరుగుతుందని..18 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు ఇది పైకి లేస్తుందని సీపీఆర్ఎఫ్ ఎంఎస్ భాటియా తెలిపారు. ఇందులో నైట్‌విజన్‌ కెమెరా, లైట్లు ఉన్నాయి. కెమెరాలో చూస్తు కమాండర్‌- సైనికులకు ఆదేశాలు ఇచ్చే సౌకర్యం కూడా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఇటువంటి బుల్డోజర్లు రెండు మాత్రమే ఉన్నాయని ఇవి స్వదేశీయంగా తయారుచేయబడినవి అని తెలిపారు.

ఈ బుల్డోజర్లు మాకు అందుబాటులోకి వచ్చినప్పటినుంచి ఉపయోగిస్తున్నామని..మాకు ఎంతగానో సహాయంగా ఉన్నాయని..ఇది వచ్చిన తర్వాత విజయాలు కూడా అందుకుంటున్నామని తెలిపారు. ఇందులో అమర్చిన థర్మల్‌ కెమెరాల ద్వారా గోడ వెలుపలి వైపు కూడా చూడవచ్చని..అక్కడి నక్కి ఉండే ఉగ్రవాదులను మట్టుబెట్టవచ్చని తెలిపారు.

పుల్వామా ఘటన తర్వాత జాతీయ రహదారిపై ఆయుధాల ఆధునీకరణ, సీసీటీవీ నిఘాలో సాంకేతికతను విస్తృతంగా ఉపయోగిస్తున్నామని ఇవి మంచి ఫలితాలనిస్తున్నాయని తెలిపారు. డ్రోన్‌లు, నైట్‌ విజిల్‌ కెమెరాలు, బుల్లెట్‌ ప్రూఫ్‌, మైన్‌ ప్రూఫ్‌ వాహనాలు, మీడియం బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను కూడా ఏర్పాటు చేశామన్నారు.

కాగా..ఈ బుల్డోజర్లకు టైర్లు ఉండవు..యుద్ధ ట్యాంక్ లా చైన్‌ సిస్టమ్‌ ఉంటుంది. కొండలు, గుట్టల మీదనుంచి కూడా ఈజీగా నడుస్తుంది. ఈ బుల్‌డోజర్లు ఇప్పుడు జమ్మూ కశ్మీర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉగ్రవాదులు దాక్కున్న ఇళ్ల నుంచి వారిని తరిమికొట్టేందుకు ఈ బుల్‌డోజర్లు ఉపయోగపడుతున్నాయి.

ఉగ్రవాదులను మాత్రమే మట్టుబెట్టాలన్నది మా లక్ష్య అని..ఈ క్రమంలో పౌరులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేలా చూస్తామన్నారు. ఆర్మీ అవసరాలకు అనుగుణం ఇటువంటి వాహనాలను మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని తెలిపారు. CSRV మేడిన్‌ ఇండియా. దీని ద్వారా ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టగలగడమే కాదు సైనిక బలగాల్లో ఇది ఆత్మవిశ్వాసం నింపుతోంది.