ఆమె అదృష్టం : పెళ్లి సెలవే ఆ జవాన్‌ను బతికించింది

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 10:33 AM IST
ఆమె అదృష్టం : పెళ్లి సెలవే ఆ జవాన్‌ను బతికించింది

మహారాష్ట్ర: పెళ్లి సెలవు ఆ జవాను ప్రాణాలను కాపాడింది. పుల్వామా ఉగ్రదాడి నుంచి తప్పించుకునేలా చేసింది. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.  ఆత్మాహుతి దాడిలో జవాన్ల బస్సు ముక్కలైంది. ఇదే బస్సులో వెళ్లాల్సిన ఓ జవాన్ మాత్రం చివరి నిమిషంలో సెలవు దక్కడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

 

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన 28ఏళ్ల థాకా బేల్కర్‌ సీఆర్పీఎఫ్‌లో జవానుగా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 24న అతడి వివాహం. దీంతో సెలవు కావాలని కొన్నిరోజుల క్రితం  ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఫిబ్రవరి 14న 75 వాహనాల్లో 2వేల 500మంది జవాన్లతో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ జమ్మూ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరింది. అందులో వెళ్లేందుకు  బేల్కర్ కూడా సిద్ధమయ్యాడు. తీరా వాహనంలోకి వెళ్లి కూర్చోగానే సెలవు మంజూరు చేసినట్లు అధికారుల నుంచి న్యూస్ వచ్చింది. దీంతో సంతోషంతో బేల్కర్ బస్సు దిగాడు. సహచరులకు  వీడ్కోలు చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు.

 

ఇంటికి చేరుకోగానే అతడికి షాకింగ్ న్యూస్ వినిపించింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగినట్లు, ఆ ప్రమాదంలో తాను ఎక్కి దిగిన బస్సులోని సహచరులు ప్రాణాలు కోల్పోయినట్టు  తెలుసుకుని బేల్కర్ దిగ్ర్భాంతికి గురయ్యాడు. పుల్వామా ఘటన తర్వాత బేల్కర్ తమతో కూడా సరిగ్గా మాట్లాడటం లేదని కుటుంబసభ్యులు చెప్పారు. పెళ్లి జరగబోతోందన్న ఆనందం కూడా  బేల్కర్‌లో ఎక్కడా లేదని వాపోయారు.