Amravati Curfew: అమరావతిలో హింస.. కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం

త్రిపురలో చెలరేగిన అల్లర్లు మహారాష్ట్రలోని పలు జిల్లాలకు వ్యాపించాయి.

Amravati Curfew: అమరావతిలో హింస.. కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం

Amaravati (1)

Amravati Curfew: త్రిపురలో చెలరేగిన అల్లర్లు మహారాష్ట్రలోని పలు జిల్లాలకు వ్యాపించాయి. అమరావతిలో స్థానిక బీజేపీ కార్యకర్తలు చేపట్టిన బంద్‌‌లో హింస చోటుచేసుకోగా పోలీసులు అప్రమత్తం అయ్యారు.

నాలుగు రోజులపాటు కర్ఫ్యూ విధించారు. పుకార్లు వ్యాప్తి చెందకుండా మూడు రోజులపాటు ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. త్రిపురలో మైనార్టీలపై దాడిచేసి, ఓ ప్రార్థనా మందిరాన్ని దుండగులు ధ్వంసం చేశారనే వార్తలతో అమరావతిలో ముస్లిం సంఘాలు ర్యాలీలు చేశాయి.

ఈ సమయంలో స్థానిక షాపులపై కొందరు రాళ్లు రువ్వడం, విధ్వంసం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఈ క్రమంలోనే అల్లర్లు, విధ్వంసాన్ని అడ్డుకునేందకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది.

ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో మైనార్టీలపై దాడులను నిరసిస్తూ మహారాష్ట్రలో ముస్లిం సంస్థలు బంద్ నిర్వహించాయి. ముస్లింల బంద్‌పై నిరసన వ్యక్తం చేస్తూ కాషాయశ్రేణులు ఆందోళనలకు దిగగా.. రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

ఆందోళనలు అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే రెండు రోజులపాటు చోటుచేసుకున్న హింసను దృష్టిలో పెట్టుకొని పోలీసులు అమరావతి నగర పరిధిలో కర్ఫ్యూ విధించారు. నాందేడ్, నాసిక్, యావత్మల్‌ తదితర ప్రాంతాల్లోనూ ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

మహారాష్ట్రలోని అమరావతిలో అల్లర్లుపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ప్రకటనలో.. త్రిపురలో మసీదు కూల్చివేశారనే ప్రచారం అవాస్తవమని, లేనిపోని ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళనకు గురికావొద్దని వెల్లడించింది.