Cocaine Seize : పొట్టలో రూ.11 కోట్ల విలువైన కొకైన్‌..

బెంగళూరు ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న భారీ కొకైన్‌ను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఆఫ్రికాకు చెందిన వ్యక్తి నుంచి రూ. 11 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Cocaine Seize : పొట్టలో రూ.11 కోట్ల విలువైన కొకైన్‌..

Cocaine

cocaine seized in bangalore airport : మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కేటుగాళ్లు రకరకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. బట్టలు, బుక్స్, లోదుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు..ఇలా వినూత్న పద్ధతిలో మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు శరీరాన్ని సైతం వినియోగించుకుంటున్నారు. ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. తాజాగా బెంగళూరు ఎయిర్‌పోర్టులో కడుపులో కొకైన్ పెట్టుకుని అక్రమంగా తరలిస్తున్న విదేశీయుడు పట్టుబడ్డాడు.

బెంగళూరు ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న భారీ కొకైన్‌ను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఆఫ్రికా దేశానికి చెందిన వ్యక్తి నుంచి దాదాపు రూ. 11 కోట్ల విలువైన కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి బెంగళూరుకు వచ్చిన ఆఫ్రికా దేశస్తుడు విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఆహారం, మంచినీరు తీసుకోలేదు.

దీంతో అనుమానం వచ్చిన అధికారులు అతనిని స్కాన్‌ చేయగా పొట్టలో భారీగా కొకైన్‌ ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తొలుత నిందితుడు నేరాన్ని అంగీకరించలేదు. తర్వాత కడుపులో ఇబ్బందిగా ఉండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లాలని పోలీసులను కోరాడు.

దీంతో నిందితుడిని  ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సహాయంతో అతని కడుపులో నుంచి కొకైన్‌ పొట్లాలను బయటికి తీశారు. కొకైన్‌ విలువ రూ. 11 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.