బుల్ బుల్ తుఫాన్ : ఒడిశాకు పొంచి ఉన్న ముప్పు

  • Published By: madhu ,Published On : November 6, 2019 / 05:15 AM IST
బుల్ బుల్ తుఫాన్ : ఒడిశాకు పొంచి ఉన్న ముప్పు

హికా, ఫణి, క్యార్, మహా..ఇప్పుడు బుల్ బుల్ తుఫాన్. మహా తుఫాన్ ధాటికి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి బుల్ బుల్ తుఫాన్ అని పేరు పెట్టారు. రానున్న 24 గంటల్లో అతి తీవ్ర తుఫాన్‌గా మారి బెంగాల్ వైపు వెళుతుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ వద్ద వాయుగుండం కేంద్రీకృతమైంది. ఉత్తర అండమాన్ సముద్రం, ఒడిశాలోని పారాదీప్ ఆగ్నేయంగా 890 కి.మీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ దీవులకు ఆగ్నేయంగా 980 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. తుఫాన్ ఖచ్చితంగా ఏ దిశలో వెళుతుందనేది నిర్ధారణ కాలేదని తెలిపారు. నవంబర్ 08వ తేదీ శుక్రవారం నాటికి అతి తీవ్ర తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. దీని ప్రభావం వల్ల నవంబర్ 06 బుధవారం, నవంబర్ 07వ తేదీ గురువారం అండమాన్ – నికోబార్ దీవుల్లో, నవంబర్ 09వ తేదీన ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 

ఒడిశా రాష్ట్రంలో భారీ వర్షాలు :-
దీని ప్రభావంగా ఒడిశా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు అధికారులు. ఇటీవలే వచ్చిన ఫణి తుఫాన్ ఒడిశాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. పలువురు మృతి చెందారు. నవంబర్ 09వ తేదీ నుంచి వర్షాలు స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయని తెలిపారు.

ప్రభావం పడే జిల్లాలు : –
బాలాసోర్, భద్రక్, కేంద్రపార, జగత్సింగ్ పూర్, గంజాం, పూరి, గజపతి, కోరాపుట్, రాయగడ, నబరంగ్ పూర్, కల్హండి, కందమల్, బౌద్, మల్కన్ గిరి. పంటలు పండించిన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. 

పశ్చిమ బెంగాల్‌లో కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. నవంబర్ 08 సాయంత్రం నుంచి ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలకు దూరంగా వాయువ్య బంగాళాఖాతంలో 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. సముద్రం అల్లకల్లోల్లంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఇప్పటికే భారీ వర్షాలతో సతమతమౌతున్న ప్రజలు..మరోసారి ఇబ్బందులు తప్పేట్లు లేవు. 
Read More : మహా తుఫాన్ : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం