24గంటల్లో తీవ్రరూపం : దూసుకొస్తున్న బుల్‌బుల్ తుఫాన్

  • Published By: sreehari ,Published On : November 7, 2019 / 09:42 AM IST
24గంటల్లో తీవ్రరూపం : దూసుకొస్తున్న బుల్‌బుల్ తుఫాన్

ఒకవైపు మహాతుఫాన్.. మరోవైపు బుల్ బుల్ తుఫాన్ ముంచుకోస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుఫాన్ తీవ్రరూపం దాల్చనుంది. వచ్చే 24 గంటల్లో బుల్ బుల్ తుఫాన్ భీకర తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఒడిశా మినహా.. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల మీదుగా ఈ భయంకర తుఫాన్ దూసుకొస్తోందని IMD సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. 

ఒడిశాలో దిశ మార్చుకున్న బుల్‌బుల్ తుఫాన్ దక్షిణం నుంచి పారాదీప్ ఆగ్నేయంగా 730కిలోమీటర్ల దూరంలో వేగంగా పయనిస్తుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో మధ్య దిశగా పయనిస్తూ 7 కిలోమీటర్ల వేగంతో పుంజుకుంటోంది. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ దిశ నుంచి ఆగ్నేయంగా 830 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోందని భువనేశ్వర్ మెట్రోలాజికల్ సెంటర్ డైరెక్టర్ హెచ్ ఆర్ బిస్వాస్ తెలిపారు. 

తీరం దాటే సమయంలో 30 నుంచి 40కిలో మీటర్ల మేర బలంగా గాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. ముందుస్తు జాగ్రత్తగా ఒడిశా ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటికప్పుడూ తుఫాన్ ప్రభావాన్ని దగ్గరగా గమనిస్తూ ఉండాలని సూచించింది. బుల్ బుల్ తుఫాన్ ప్రభావంతో సమీప ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తీర ప్రాంతాల్లోని మొత్తం 15 రాష్ట్రాలకు చెందిన 30 జిల్లాల అధికారులకు ముందుగానే హెచ్చరికలు జారీ చేసినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. వరద ముప్పు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలకు సంబంధించి పలు సూచనలు చేసినట్టు చెప్పారు. సైక్లోన్ సిస్టమ్ ఆధారంగా తుఫాన్ ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని, ఏ దిశ తిరుగుతుంది అనేదానిపై నిశితంగా గమనిస్తున్నామని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ముర్తంజయ్ మెహపాత్ర చెప్పారు.