పశ్చిమ బెంగాల్ వైపు వెళ్తున్న ఫొని తుఫాన్

  • Published By: veegamteam ,Published On : May 3, 2019 / 06:57 AM IST
పశ్చిమ బెంగాల్ వైపు వెళ్తున్న ఫొని తుఫాన్

ఫొని తుఫాన్ ఒడిషాలోని పూరీ దగ్గర తీరం దాటింది. తుఫాన్ పశ్చిమ బెంగాల్ వైపు దూసుకెళ్తోంది. తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సముద్రంలో అలలు భీకరంగా ఎగసిపడ్డాయి. శుక్రవారం (మే 3, 2019)న ఉదయం 8 గంటలకు తీరాన్ని తాకాయి. ఉదయం 11 గంటల సమయంలో తుఫాన్ కన్ను పూర్తిగా తీరం దాటింది. కన్ను వైశాల్యం 20 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండటంతో.. తీరానికి చేరువ అయ్యే సమయంలో మరింత స్పీడ్ గా రావటంతో గాలులు తీవ్రత అంతకంతకూ పెరిగింది. ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. పూరిళ్లు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. సెల్ టవర్లు విరిగిపోయాయి. భీకరమైన గాలులకు భయానక వాతావరణం నెలకొంది. 30 నిమిషాలుపైనే ఈదురుగాలులు విధ్వంసం సృష్టించాయి. పూరీ రోడ్లపై ఎక్కడ చూసినా విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు కనిపిస్తున్నాయి.

గంటకు 240 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో దేశంలో అతిపెద్ద మరియు భయంకరమైన తుఫానుల్లో ఒకటిగా ఫొని మారిపోతుంది. పశ్చిమ బెంగాల్ వైపు తుఫాన్ దూసుకురావడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఫొని తుఫాన్ ప్రభావంతో సీఎం మమతా బెనర్జీ రాజకీయ సభలు, సమావేశాలను 48 గంటల పాటు రద్దు చేసుకున్నారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సహాయక చర్యలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.