తీరం దాటే వరకు బయటికి రావొద్దు : సూపర్‌ సైక్లోన్‌గా ఫోని

10TV Telugu News

ఫోని తుపాన్‌ సూపర్‌ సైక్లోన్‌గా మారింది. ప్రస్తుతం విశాఖపట్నానికి 175 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 19 కిమీ వేగంతో కదులుతోంది. దక్షిణ ఒడిశా వైపు దూసుకెళ్తోంది.  శుక్రవారం (మే 3,2019) పూరీ దగ్గర తుపాను తీరం తాకే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం తీర మండలాల్లో హై అలర్ట్  ప్రకటించారు. జిల్లాలోని జాతీయ రహదారులపై ఆంక్షలు విధించారు. గురువారం (మే 2, 2019) రాత్రి 8గంటల నుండి శుక్రవారం (మే 3,2019) ఉ.9గంటల వరకు రాకపోకలు నిలిపివేశారు.  తుపాను తీరం దాటే వరకు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని హెచ్చరించారు.

కుంభవృష్టి కురిసే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. విజయనగరం, శ్రీకాకుళం తీర ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తీరప్రాంత ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఒడిశాపై తుపాను విరుచుకుపడనుంది. తుపాను కారణంగా భువనేశ్వర్, కోల్ కతా ఎయిర్ పోర్టులు గురువారం రాత్రి 9.30గంటలకు మూసేశారు.  శనివారం (మే 4,2019) సాయంత్రం 6 గంటల తర్వాత ఎయిర్ పోర్టులు తెరిచే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాపై ఫోనీ తుపాను విరుచుకుపడుతోంది. ఈదురుగాలులతో సిక్కోలు వాసులను  భయభ్రాంతులను చేస్తోంది. తిత్లీ తుపాన్‌ను మించిన ఈదురుగాలులకు శ్రీకాకుళం వాసులు వణికిపోతున్నారు. ఏ క్షణాన ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

ఫొని తుపాను కారణంగా ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ పరిధిలో పలు రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. విశాఖపట్నం-ఒడిశాలోని భద్రక్‌ మధ్య ఎక్కువ రైళ్లు  రద్దయ్యాయి. 70కి పైగా రైలు సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైళ్ల రద్దు సమాచారం తెలుసుకునేందుకు విజయనగరం రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక  సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఫోని తపాను ప్రభావంతో విజయనగరంలో జిల్లాలోని సముద్ర తీరప్రాంత గ్రామాల్లో వర్షం జల్లులు ప్రారంభమయ్యాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది.  మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

శ్రీకాకుళం జిల్లా 8 ప్రాంతాల్లో 14 ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. కవిటి, పలాస, వజ్రపుకొత్తూరు, ఇచ్ఛాపురం మండలాల్లోని పలు తీరప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన  భారీ వర్షం కురుస్తోంది. దీంతో జాతీయ రహదారిపైన వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. మరోవైపు కుందువాని పేట, ఘనగలవాని పేట, ఇప్పిలిలోని పలు పునరావాస సహాయక  కేంద్రాల్లో బాధితులకు సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇటు నరసన్నపేట మండలం కామేశ్వరిపేట దగ్గర వంశధార రైల్వే బ్రిడ్జి పనుల నిమిత్తం వచ్చిన కూలీలు  తుపానుకు చిక్కుకున్నారు.

ఫోని తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వణికిపోతోంది. బలమైన ఈదురుగాలులు, వరద ముప్పు, భారీ వర్షాలు ఉంటాయన్న హెచ్చరికలతో 12మండలాల్లో హై అలెర్ట్ ప్రకటించారు.. ముఖ్యంగా  ఒడిశాలో వర్షాలు కురుస్తున్నందున వంశధార, నాగావళి, బహుదా నదులకు వరదలు వచ్చే ప్రమాదం ఉందని, పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలన్నారు. తిత్లీ తుఫాన్  ప్రభావం చూపిన ఉద్దానం ప్రాంతంలో మళ్లీ ఫొని తుఫాన్ ముంచుకొస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.