ఫోని తుఫాన్ : తూర్పు తీరం అల్లకల్లోలం

  • Published By: madhu ,Published On : May 2, 2019 / 12:46 AM IST
ఫోని తుఫాన్ : తూర్పు తీరం అల్లకల్లోలం

ఫోని పెను తుఫాన్‌ తీరాన్ని గడగడలాడిస్తోంది. బంగాళాఖాతంలో అలజడి రేపుతోంది. తుఫాన్‌ తీరంవైపు దూసుకొస్తోంది. మే 03వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఒడిశాలోని పూరీ దగ్గర గోపాల్‌పూర్‌ – చాందబలి మధ్య తీరందాటే అవకాశముంది. మరోవైపు ఉత్తరాంధ్రలో తుఫాన్‌ ప్రభావం అధికంగా ఉండనుండడంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది.
మే 02వ తేదీ గురువారం ఉత్తర కోస్తా తీరానికి దగ్గరగా రానుంది.

సముద్రపు కెరటాలు ఎగసిపడుతున్నాయి. గాలులు గంటకు 170 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. బుధవారం ఉదయం వరకు వాయవ్యంగా పయనించిన ఫోని తుఫాన్‌ దిశ మార్చుకుంది.  ఉత్తర వాయవ్యంగా.. ఆ తర్వాత ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుంది. ఈ క్రమంలో కొన్ని గంటలపాటు నెమ్మదిగా కదిలి మరింత బలపడింది. తుఫాన్‌ విశాఖకు దక్షిణ ఆగ్నేయ దిశగా 320 కిలో మీటర్ల దూరంలో, ఒడిశాలోని పూరీకి దక్షిణ నైరుతి దిశగా 570 కిలో మీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమైంది. అయితే బుధవారం నుంచి ఉత్తర ఈశాన్యంగా పయనిస్తున్న తుఫాన్‌.. నెమ్మదిగా ఉత్తర కోస్తా దిశగా వచ్చే అవకాశం ఉంది.

గురువారం సాయంత్రానికి విశాఖపట్నానికి వంద నుంచి 150 కిలోమీటర్ల దూరంలోకి.. ఉత్తర కోస్తా జిల్లాల వైపు  పయనించేటప్పుడు కళింగపట్నానికి 50 నుంచి 60 కిలోమీటర్ల చేరువగా రానుంది. కళింగపట్నానికి సమాంతరంగా వచ్చినప్పుడు తుఫాన్‌లో కొంత భాగం భూమిపైకి వస్తుంది. అక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లా సరిహద్దుదాటే సమయంలో  130 కిలోమీటర్ల పొడవున తుఫాన్‌లో కొంతభాగం భూ ఉపరితలంపై పయనించనుంది. దీనివల్ల శ్రీకాకుళం జిల్లాలో పెనుగాలులు వీయడంతోపాటు భారీ నుంచి  అతిభారీ వర్షాలు కురుస్తాయి.