మహా తుఫాన్ : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

  • Published By: madhu ,Published On : November 6, 2019 / 12:39 AM IST
మహా తుఫాన్ : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం 2019, 05వ తేదీ మంగళవారం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 06వ తేదీ బుధవారానికి తీవ్ర వాయుగుండంగా మారనుందని తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో మహా తుఫాన్ ఉందని, ఇది క్రమంగా బలహీనపడి నవంబర్ 07వ తేదీ గురువారం గుజరాత్‌లో తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

తూర్పు మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో మాయాబంధర్‌కు పశ్చిమ వాయువ్య దిశగా 200 కి.మీటర్లు, పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 920 కి.మీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. తదుపరి 24 గంటల్లో తుఫాన్‌గా మారి ఉత్తర వాయువ్య దిశగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురువరాల్లో అక్కడక్క ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మంగళవారం మాత్రం పొడి వాతావరణం ఏర్పడిందని, రాత్రి వేళ టెంపరేచర్స్ క్రమంగా తగ్గి చలి పెరుగుతోందన్నారు. మంగళవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లాలో 17.1 డిగ్రీ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 

ఇక అరేబియా సముద్రంలో కొనసాగుతున్న మహఆ అత్యంత తీవ్రమైన తుఫాన్ ఉత్తర దిశగా ప్రయాణించి, అతితీవ్ర తుఫాన్‌గా బలహీన పడి పశ్చిమ మధ్య అరేబియా సముద్రం, మధ్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో వీరవల్ పశ్చిమ నైరుతి దిశగా 720 కి.మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది తూర్పు ఈశాన్య దిశగా ప్రయాణించి క్రమంగా బలహీన పడి తుఫాన్‌గా మారి గుజరాత్ తీరంలో డియూ, పోర్ బందర్‌ల మధ్య ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. 
Read More : ఆర్టీసీ ఇక చరిత్రేనా : సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ