Cyclone Tauktae : తౌటే తుఫాన్ బీభత్సం, వందలాది ఇళ్లు ధ్వంసం, నిరాశ్రయులైన వేలాది మంది

తౌటే తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాన్‌ తీవ్రరూపం దాల్చింది. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవాలో భారీనష్టం వాటిల్లింది. కేరళలో సముద్రం ముందుకు రావడం, అలల ఉధృతికి వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.

Cyclone Tauktae : తౌటే తుఫాన్ బీభత్సం, వందలాది ఇళ్లు ధ్వంసం, నిరాశ్రయులైన వేలాది మంది

Cyclone

West Coast :  తౌటే తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాన్‌ తీవ్రరూపం దాల్చింది. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవాలో భారీనష్టం వాటిల్లింది. కేరళలో సముద్రం ముందుకు రావడం, అలల ఉధృతికి వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కర్ణాటకలో భారీ వర్షాలకు 73 గ్రామాల్లో భారీగా నష్టం జరిగింది. కర్నాటకలో నలుగురు, గోవాలో ఇద్దరు మృతి చెందారు. తుపాన్‌ ప్రభావంతో కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ముంబైకి దక్షిణ నైరుతి దిశగా : –
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్‌ అత్యంత తీవ్రమైన తుపాన్‌గా మారి.. ముంబైకి దక్షిణ నైరుతి దిశగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. 24 గంటల్లో తుఫాన్‌ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు. రేపటి వరకూ భారీ వర్షాలు కురుస్తాయని సూచించారు.

గుజరాత్ తీరం : –
తుఫాన్‌ ఉత్తర వాయువ్య దిశగా పయనించి 2021, మే 17వ తేదీ సోమవారం సాయంత్రానికి గుజరాత్‌ తీరాన్ని తాకుతుందని.. మంగళవారం ఉదయం పోర్‌బందర్‌, మహువా మధ్య తీరం దాటే అవకాశముందని ఐఎండీ తెలిపింది. తుఫాన్‌ తీరం దాటే సమయంలో 150 నుంచి 170 కిలోమీటర్ల వేగంలో గాలులు వీస్తాయని హెచ్చరించారు. ఇప్పటికే తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ప్రభావిత రాష్ట్రాలలో 100 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు.

వందలాది ఇళ్లు ధ్వంసం : –
భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలల తాకిడికి కేరళ అల్లాడిపోతోంది. సముద్రం ఉన్నట్టుండి ముందుకు చొచ్చుకురావడంతో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. 9 జిల్లాలలో తీవ్ర ప్రభావం ఉంది. ఎర్నాకుళం, త్రిసూర్‌, తిరువనంతపురం, అలప్పుజా, కోజికోడ్‌లలో అలలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. తీర, లోతట్టు ప్రాంతాలలో వందలాది కుటుంబాలను పునరావాస శిబిరాలకు తరలించారు. ఎర్నాకులం, ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

అతి భారీ వర్షాలు : –
ఇక మరో 24 గంటల్లో ముంబై, థానె, ఉత్తర కొంకణ్‌, పాలగఢ్‌ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. రాయ్‌గఢ్‌లో మరింత ఎక్కువగా వర్షాలు పడతాయని తెలిపింది. తీర ప్రాంతాలలో బలమైన గాలులు వీస్తాయని సూచించింది. తుపాన్‌ నుంచి ముంబై నగరానికి నేరుగా ముప్పులేదని.. వచ్చే 24 గంటల్లో భారీ వర్షసూచన ఉండటంతో ముంబై వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఎల్లో అలర్ట్ : –
తుఫాన్‌ తీరం దాటనున్న గుజరాత్‌లో అధికారులు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. రవాణా, విద్యుత్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తీరం దాటే సమయంలో జునాగఢ్‌లో 3 మీటర్ల ఎత్తు వరకూ, ఇతర ప్రాంతాలలో 1 నుంచి రెండున్నర మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడతాయని తెలిపింది. గుజరాత్‌తో పాటు గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

Read More : Black Fungus : షుగర్ నియంత్రణలో ఉంచుకుంటే..ఫంగస్ దరిచేరదు!