Cyclone Tauktae: వాయుగుండంగా మారిన తౌక్టే తుఫాన్.. ఆ రాష్ట్రాలకు భారీ వర్షాలు!

మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాలను గడగడలాడించిన అతి భీకర తౌక్టే తుఫాన్ క్రమంగా బలహీనపడి ప్రస్తుతం వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది.

Cyclone Tauktae: వాయుగుండంగా మారిన తౌక్టే తుఫాన్.. ఆ రాష్ట్రాలకు భారీ వర్షాలు!

Cyclone Tauktae

Cyclone Tauktae: మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాలను గడగడలాడించిన అతి భీకర తౌక్టే తుఫాన్ క్రమంగా బలహీనపడి ప్రస్తుతం వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. తొలుత అతిభీకర తుపానుగా రూపాంతరం చెందిన తౌక్టే తుఫాన్ సోమవారం అర్ధరాత్రి తర్వాత 1.30 గంటలకు గుజరాత్​లోని దీవ్, ఉనాల మధ్య తీరం దాటిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సమయంలో గుజరాత్ చిగురుటాకులా వణికిపోయింది. తుఫాన్ వలన కురిసిన వర్షాలు, గాలుల ప్రభావంతో వివిధ ఘటనల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

కాగా, తీరం దాటిన అనంతరం క్రమేపీ బలహీనపడి వాయుగుండంగా మారిందని తెలిపిన IMD ప్రస్తుతం వాయుగుండంగా మారినా దీని ప్రభావంతో గుజరాత్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం వాయుగుండం దక్షిణ రాజస్థాన్, గుజరాత్ పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని IMD బుధవారం ఉదయం వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో ఈ వాయుగుండం ఈశాన్యం వైపు ప్రయాణించి రాజస్థాన్ మీదుగా పశ్చిమ ఉత్తర్​ప్రదేశ్​కు చేరుకుంటుందని పేర్కొంది.

ఈ వాయుగుండం ప్రభావంతో తూర్పు రాజస్థాన్​లో స్పల్ప స్థాయి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం మరికొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వెల్లడించింది. మొత్తంగా ఈ వాయుగుండం ప్రభావంతో గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్​ప్రదేశ్, ఉత్తర్​ప్రదేశ్, దిల్లీలోనూ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తీరం దాటినా తౌక్టే ప్రభావంతో రాజధాని పరిసర ప్రాంతాల్లో వర్షం పడొచ్చని IMD అంచనా వేసింది.