Dalit Girl Death : ఢిల్లీలో దళిత బాలికపై అత్యాచారం,హత్య..కేసు క్రైం బ్రాంచ్ కి బదిలీ

ఢిల్లీ కంటోన్మెంట్‌ ఏరియాలోని పాత నంగల్‌ గ్రామానికి చెందిన 9 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం, హ‌త్య‌ ఘటన దేశంలో చర్చనీయాంశంగా మారింది.

Dalit Girl Death : ఢిల్లీలో దళిత బాలికపై అత్యాచారం,హత్య..కేసు క్రైం బ్రాంచ్ కి బదిలీ

Child Death

Dalit Girl Death ఢిల్లీ కంటోన్మెంట్‌ ఏరియాలోని పాత నంగల్‌ గ్రామానికి చెందిన 9 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం, హ‌త్య‌ ఘటన దేశంలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా బాలిక తల్లిదండ్రుల అనుమతి లేకుండానే రాత్రికి రాత్రే అంత్యక్రియలు పూర్తి చేసిన వైనం ప్రకంపనలు పుట్టిస్తోంది. దీనిని పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, ప్రముఖులు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు.. బుధవారం ఈ కేసును వేగవతమైన దర్యాప్తు కోసం క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ రేప్ సెక్షన్లు నమోదుచేశామని,ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. శ్మశానవాటిక నుంచి కాలిన బాలిక కాళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా ఈ కేసును ఆగస్టు 4న నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీసీసీఆర్) సుమోటోగా తీసుకుంది. అంతేకాకుండా 48 గంటల్లో దీనిపై సరియైన నివేదికను సమర్పించాలని ఢిల్లీ సౌత్‌ వెస్ట్‌ డీసీపీకి ఎన్‌సీసీసీఆర్ లేఖ రాసింది. కాగా ఢిల్లీ పోలీసు కమిషనర్, రాకేశ్ ఆస్థానా ఈ కేసు బదిలీకి దిశానిర్దేశం చేశారు.

అసలేం జరిగింది
ఢిల్లీ కంటోన్మెంట్‌ ఏరియాలోని పాత నంగల్‌ గ్రామానికి చెందిన బాధితురాలి కుటుంబం శ్మశానానికి ఎదురుగా ఉన్న ఇంట్లో నివసిస్తోంది. ఆదివారం సాయంత్రం సమయంలో అక్కడ ఉన్న వాటర్‌కూలర్‌ నుంచి నీళ్లు తెస్తానని తల్లికి చెప్పి వెళ్లిన బాలిక ఎంతకీ తిరిగిరాలేదు. అరగంట తర్వాత కాటికాపరి రాధేశ్యామ్‌ ఆమె తల్లి వద్దకు వచ్చి బాలిక మరణించినట్లు చెప్పాడు. వాటర్‌ కూలర్‌ నుంచి నీళ్లు పడుతున్న సమయంలో విద్యుత్‌ షాక్‌ తగిలి బాలిక మరణించినట్లు చెప్పాడు. పోలీసులకు ఈ విషయం తెలిస్తే పోస్ట్‌మార్టం పేరుతో ఇబ్బంది పెడతారని, అవయవాలు దొంగతనం చేస్తారని చెప్పి హడావుడిగా బాలిక మృతదేహాన్ని దహనం చేయించాడు. అయితే రాధేశ్యామ్‌ తీరుపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫోన్‌ చేశారు. తమ బిడ్డపై కాటికాపరి సహా మరికొందరు అత్యాచారం చేసి చంపేశారని ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ తమ ఇంటివద్దే న్యాయపోరాటం చేస్తున్నారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఓ పూజారితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నలుగురు నిందితులకు డ్రగ్స్ టెస్ట్,లై డిటెక్టర్ టెస్ట్ చేయనున్నట్లు సౌత్ ఈస్ట్ ఢిల్లీ డీసీపీ ఇంగిత్ ప్రతాప్ సింగ్ బుధవారం తెలిపారు.

బాధిత కుటుంబానికి అండగా రాహుల్ గాంధీ
అత్యాచారం, హ‌త్య‌కు గురైన 9 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బుధవారం ప‌రామ‌ర్శించారు. చిన్నారి కుటుంబ‌స‌భ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ కేసు విష‌యంలో న్యాయం జ‌రిగే వ‌ర‌కు వారికి అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు. బాధితురాలు కేవ‌లం ఆ కుటుంబానికి మాత్ర‌మే ఆడ‌బిడ్డ కాద‌ని, ఈ దేశానికి చెందిన ఆడ‌బిడ్డ అని రాహుల్ వ్యాఖ్యానించారు.

బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ప్రకటించిన కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం బాధిత కుటుంబాన్ని కలిశారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని వారికి కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. అదేవిధంగా రూ.10లక్షల ఆర్థిక పరిహారాన్ని కూడా చిన్నారి కుటుంబానికి కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశిస్తున్నామని.. . టాప్ లాయర్లను నియమించి నిందుతులకు కఠినశిక్ష పడేలా చూస్తాం అని కేజ్రీవాల్ తెలిపారు.