మాస్క్ తో పర్యావరణానికి డేంజర్, పేరుకపోతున్న వ్యర్థాలు

మాస్క్ తో పర్యావరణానికి డేంజర్, పేరుకపోతున్న వ్యర్థాలు

Danger to the environment with the mask : మాస్క్‌ ఇంత డేంజరా.. అంటే అవుననే అంటున్నారు ఢిల్లీ శాస్త్రవేత్తలు. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మాస్కుల వినియోగం బాగా పెరిగిపోయింది. వైరస్‌ వ్యాపించకుండా రక్షణ కోసం మాస్కులు ధరించడం పరిపాటిగా మారింది. దీంతో వాడి పడేసిన మాస్కుల గుట్టలు పేరుకుపోతున్నాయి. మాస్కుల వ్యర్థాలు పేరుకుపోవడంపై పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అవి పూర్తిగా మట్టిలో కలిసేందుకు సుమారు 50 ఏండ్లు పడుతుందని చెబుతున్నారు.

సాధారణంగా మాస్క్‌ను పాలీప్రొఫైలిన్, రబ్బరుతో తయారు చేస్తారని.. అవి డీకంపోజ్‌ కావడానికి దాదాపు 20-30 సంవత్సరాలు, రబ్బర్‌ బ్యాండ్‌ పూర్తిగా ఉనికిని కోల్పోవటానికి 50 సంవత్సరాలు పడుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. దీంతో మాస్క్‌ మొత్తం మట్టిలో కలిసేందుకు 50 ఏండ్లు పడుతుందని తెలిపారు.  ఒక్క మన దేశంలోనే 120 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. వంద మందిలో కనీసం ముగ్గురు ప్రతి రోజు ఒక్క మాస్క్‌ను వాడిపడేస్తే.. ఆ వ్యర్థాలతో రోజుకొక పది ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌ను నింపవచ్చని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

కేవలం ఆరోగ్య కార్యకర్తలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే దేశవ్యాప్తంగా సుమారు 2 నుంచి మూడు కోట్ల మాస్కులను ప్రతిరోజు వినియోగిస్తున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. మాస్క్‌ వ్యర్థాల నిర్వహణపై అన్ని దేశాలు ప్రధానంగా దృష్టి సారించాలని సూచిస్తున్నారు.