రైతుల ఆత్మహత్యలపై డేటా లేదు: కేంద్రం

  • Published By: venkaiahnaidu ,Published On : September 21, 2020 / 05:54 PM IST
రైతుల ఆత్మహత్యలపై డేటా లేదు: కేంద్రం

దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఎంతమంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయంపై స్పష్టత ఇవ్వలేమని కేంద్రం తెలిపింది. రైతుల ఆత్మహత్యలపై కేంద్రం దగ్గర ఎటువంటి డేటా లేదని సోమవారం హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో చెప్పారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలపై డేటాను సేకరించడాన్ని రాష్ట్రా ప్రభుత్వాలే నిలిపివేశాయన్నారు. రైతులు ఆత్మహత్యలకు సంబంధించి నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వద్ద డేటా లేదన్నారు.

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(NCRB) సమాచారం ప్రకారం.. అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యలకు గల కారణాలపై సమాచారం లేనందున, దీనిపై స్పష్టమైన సమాచారం ఇవ్వలేమని ఆయన తెలిపారు.


వాస్తవానికి కొన్ని రాష్ట్రాలు ఇచ్చిన రైతుల ఆత్మహత్యల సమాచారం ప్రకారం… వ్యవసాయ రంగంలో 2018లో 10,357 ఆత్మహత్యలు నమోదవ్వగా 2019లో 10,281 నమోదయ్యాయని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో వెల్లడించింది. తాజా ఎన్‌సిఆర్‌బి నివేదిక ప్రకారం దేశంలో మొత్తం ఆత్మత్యల్లో రైతుల ఆత్మహత్యల రేటు 7.4 శాతంగా ఉందని తెలిపింది.