గుడ్ న్యూస్ : కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి

గుడ్ న్యూస్ : కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి

DCGI approved Covishield and covaxin vaccines : కరోనా వ్యాక్సిన్లపై దేశప్రజలకు డీసీజీఐ తీపికబురు అందించింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్‌కు, ఐసీఎంఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు అత్యవసర అనుమతులు ఇచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో రెండు వ్యాక్సిన్ల పరిమిత వినియోగానికి అనుమతి ఇస్తున్నట్టు డీసీజీఐ ప్రకటించింది. మూడో దశ ట్రయల్స్ నిర్వహించేందుకు కెడలాకు అనుమతి ఇచ్చింది.

భారత్ లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు మొదటగా అందుబాటులోకి రానున్నాయి. భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను తయారు చేసింది. భారత్ లో ఆక్స్ ఫర్డ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను సీరం ఉత్పత్తి చేస్తోంది. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ భద్రమైనదని నిర్ధారణ అయినట్లు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ వేణుగోపాల్ సోమాని తెలిపారు. క్లినికల్ ట్రయల్స్ లో కోవిషీల్డ్ సత్ఫలితాచ్చిందని పేర్కొన్నారు. ఈ రెండు వ్యాక్సిన్లలో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని స్పష్టం చేశారు. ఈ రెండు వ్యాక్సిన్లు 2 డోసులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి ఇవ్వడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్‌ పై పోరాటంలో ఇదో ముందడుగుగా అభివర్ణించారు. స్వదేశీ వ్యాక్సిన్లకు అనుమతి వచ్చిందని చెప్పారు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. భారత్‌ను కోవిడ్ రహిత దేశంగా మార్చేందుకు సీరమ్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్లు దారిచూపుతాయన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్తలకు, ఆవిష్కరణకర్తలకు శుభాభినందనలు తెలిపారు.

ఇప్పటికే కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌కు ఆమోద ముద్రవేయాలని డీసీజీఐకి నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. కొవిషీల్డ్‌ను ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేయగా.. పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ భాగస్వామిగా ఉంది. కొవాగ్జిన్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన టీకా. ఈ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కంపెనీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో అభివృద్ధి చేసింది.

నిపుణుల కమిటీ ఆమోద ముద్ర వేయడంతో డీసీజీఐ అనుమతించింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు ఇప్పటికే వ్యాక్సిన్‌ పంపిణీకి అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేసింది.