దేశమంతా దిశ చట్టం: నిరాహార దీక్ష చేస్తున్న స్వాతి

  • Published By: vamsi ,Published On : December 15, 2019 / 02:50 AM IST
దేశమంతా దిశ చట్టం: నిరాహార దీక్ష చేస్తున్న స్వాతి

ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన దిశ బిల్లును దేశవ్యాప్తంగా అమలు చెయ్యాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించేలా ఏపీ సర్కారు తెచ్చిన చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే దేశంలో అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలు తగ్గుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టాం ప్రకారం.. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే, 21 రోజుల్లోనే కేసులను పరిష్కరించి దోషులకు జీవితఖైదు లేదా మరణశిక్ష విధిస్తారు. ఈ క్రమంలో దిశ చట్టాన్ని తక్షణమే దేశవ్యాప్తంగా తీసుకురావాలంటూ స్వాతి మాలీవాల్ ప్రధాని మోడీకి రాసిన లేఖలో అభ్యర్ధించారు. దిశ బిల్లు దేశ వ్యాప్తంగా తీసుకొచ్చేంత వరకు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. మహిళల రక్షణపై కేంద్ర ప్రభుత్వం వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, పదిరోజులుగా దీక్ష చేస్తున్నారు. దిశ బిల్లును దేశ వ్యాప్తంగా తీసుకొచ్చేంత వరకు దీక్ష విరమించేది లేదని స్వాతి స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంచలన బిల్లుకు ఆమోదం తెలిపింది రాష్ట్ర సర్కారు. ఆడపిల్లల రక్షణను గురించి ఈ మేరకు దిశ చట్టం తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీలో హోం మినస్టర్ సుచరిత ఈ బిల్లును ప్రవేశపెట్టారు. యాసిడ్ దాడులు, అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడితే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వాటిని పరిష్కిరించాలనేది ఈ చట్టం ముఖ్యమైన ఉద్ధేశ్యం. కచ్చితమైన ఆధారాలు లభ్యమైతే 21 రోజుల్లోనే మరణ శిక్ష విధించేలా ప్రభుత్వం ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదం పొందేలా చేసింది ప్రభుత్వం. ఈ బిల్లును 2019, డిసెంబరు 13న ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ దిశ చట్టాన్ని శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రస్తుతం ఎక్కడైనా కూడా ఆడవాళ్లకు సంబంధించిన దారుణమైన నేరాలు జరిగితే, నెలలు గడిచినా శిక్షలు పడట్లేదు. దీంతో నేరస్థులు భయం లేకుండా బెయిల్ పై బయటకు వచ్చి సమాజంలో తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నేరం చేసినవారిపై కేసులు నమోదైన 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో శిక్షపడేలా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడమే కాకుండా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ చట్టం ప్రకారం మహిళలు, చిన్నారులపై క్రూరమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష తప్పదు.