తమిళనాడు బాణసంచా కర్మాగార పేలుడు, పెరుగుతున్న మృతుల సంఖ్య

తమిళనాడు బాణసంచా కర్మాగార పేలుడు, పెరుగుతున్న మృతుల సంఖ్య

fire incident at Virudhunagar factory : తమిళనాడు – విరుద్‌నగర్‌ బాణసంచా కర్మాగార పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా 19 మంది చనిపోగా.. మరో 12 మంది పరిస్థితి మరింత విషమంగా ఉంది. వీరందరికి 60 నుంచి 70 శాతం వరకు శరీరం కాలిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్షతగాత్రులు మధురై రాజాజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు విరుద్‌నగర్‌ ఘటనలో అధికార పక్షంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, అధికారుల నిర్లక్ష్యానికి అమాయకులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అనుమతులను ఉల్లంఘిస్తూ విరుదునగర్‌ జిల్లాలో నిర్వహిస్తున్న టపాకాయల తయారీ కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

తమిళనాడులో బాణసంచా కర్మాగారాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ అగ్నిప్రమాదాలు కూడా ఎక్కువే. విరుదునగర్‌లోని అచంకుళంలో కార్మికులు బాణసంచా తయారీలో ఉన్నారు. బాణాసంచా తయారీకి రసాయనాలను కలుపుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. దాంతో ఆ కర్మాగారంలోని 4 షెడ్లకు మంటలు వ్యాపించాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు 10 ఫైరింజన్ల సాయంతో తీవ్రంగా శ్రమించారు. అయితే అప్పటికే భారీగా ప్రాణనష్టం జరిగింది. కర్మాగారం యజమాని భద్రతా నియమాలను పాటించకపోవడం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. పేలుడు జరిగిన వెంటనే యజమాని పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించారు తమిళనాడు సీఎం పళనిస్వామి. ఒక్కో కుటుంబానికి 3 లక్షల రూపాయలు, తీవ్ర గాయాలపాలైన వారికి లక్ష రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50 వేల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించనట్టు తెలిపింది పీఎంవో. మనసు చాలా దుఃఖంతో ఉందన్న మోదీ.. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని, బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్లో తెలిపారు.