CBDT క్లారిటీ : ఆధార్‌తో ఐటీ రిటర్న్స్.. అప్లయ్ చేయకుండానే PAN కార్డు జారీ

ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఆధార్ నెంబర్ ఉంటే చాలు.. అని ప్రభుత్వం ప్రకటించిన తరుణంలో చాలామంది పన్నుదారులకు పాన్ కార్డు అక్కర్లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది.

  • Published By: sreehari ,Published On : September 2, 2019 / 01:34 PM IST
CBDT క్లారిటీ : ఆధార్‌తో ఐటీ రిటర్న్స్.. అప్లయ్ చేయకుండానే PAN కార్డు జారీ

ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఆధార్ నెంబర్ ఉంటే చాలు.. అని ప్రభుత్వం ప్రకటించిన తరుణంలో చాలామంది పన్నుదారులకు పాన్ కార్డు అక్కర్లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది.

ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఆధార్ నెంబర్ ఉంటే చాలు.. అని ప్రభుత్వం ప్రకటించిన తరుణంలో చాలామంది పన్నుదారులకు పాన్ కార్డు అక్కర్లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. నిజానికి పాన్ కార్డు లేని వారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ఎవరికైతే పాన్ కార్డు ఉంటుందో వారు మాత్రం ఆధార్ నెంబర్ తోపాటు తమ పాన్ కార్డు వివరాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ విషయంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) క్లారిటీ ఇస్తూ ఆగస్టు 30న నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి. ఆదాయ పన్ను శాఖ నిబంధనలో సవరణ ప్రకారం.. ప్రత్యేకించి ఆధార్ ద్వారా ట్రాన్స్ జెక్షన్ చేసిన పన్నుదారులు.. పాన్ కార్డుకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు అదనంగా సమర్పించాల్సిన అవసరం ఉండదు. 

పాన్ కార్డు కేటాయింపు : ప్రత్యేక దరఖాస్తు అక్కర్లేదు
CBDT నోటిఫికేషన్ ప్రకారం.. ‘ఎవరైనా ఒక వ్యక్తి.. తన ఆధార్ నెంబర్ ను పర్మినెంట్ అకౌంట్ నెంబర్ కింద ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తారో వారికి సబ్ సెక్షన్ (5E)తో పాటు సెక్షన్ 139A కింద PAN కార్డు కేటాయించడం జరుగుతుంది. ఈ రూల్ కింద పాన్ కార్డు నెంబర్ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.. అలాగే ఎలాంటి పత్రాలు కూడా ఇవ్వాల్సిన పనిలేదు’ అని పేర్కొంది. ఆధార్ ఉండి.. పాన్ కార్డు లేనివాళ్లు.. పాన్ కార్డు కేటాయింపు కోసం 12నెంబర్ల గల బైయో మెట్రిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ను వాడుకోవచ్చు. అంటే.. ప్రత్యేకించి పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు. పన్నుదారులు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఆధార్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. పన్నుదారులు ఎవరైతే ఐటీ రిటర్న్స్ సమయంలో ఆధార్ నెంబర్ మాత్రమే ఫైల్ చేస్తారో వారికి నేరుగా పాన్ కార్డు జారీ చేయడం జరుగుతుంది’ అని ప్రకటనలో పేర్కొంది. 

ఒక వ్యక్తికి సంబంధించిన UIDAI నెంబర్ లోని వివరాల ఆధారంగా సదరు వ్యక్తికి PAN కార్డు నేరుగా కేటాయించడం జరుగుతుందని CBDT నోటిఫికేషన్‌లో తెలిపింది.  2019 ఏడాదిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొలి కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఐటీ రిటర్న్స్ దాఖలు సమయంలో పాన్ కార్డు బదులుగా ఆధార్ నెంబర్ సమర్పిస్తే చాలు అని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో చాలామంది పన్ను చెల్లింపునకు పాన్ కార్డులు ఇక అవసరం లేదని అభిప్రాయపడ్డారు. పాన్ కార్డు లేని వారు మాత్రమే ఆధార్ నెంబర్ సమర్పించాల్సి ఉంటుంది.

ఆధార్ మాత్రమే కాదు.. పాన్ కార్డు ఉండాల్సిందే : 
పాన్ కార్డు లేనందున ఆధార్ నెంబర్ నే పర్మినెంట్ నెంబర్ గా ధ్రువీకరిస్తూ సదరు వ్యక్తులకు పాన్ కార్డు కేటాయించడం జరుగుతుంది. అంతేకానీ, పాన్ కార్డు అసలు అక్కర్లేదు అని కాదని గుర్తించాలి. ఆధార్ కార్డులో 12 నెంబర్లతో పాటు పేరు, పుట్టిన తేదీ, జెండర్, చిరునామా, ఫొటో, బయోమెట్రిక్ డేటా రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇలా అన్ని వివరాలు ఉంటాయి. అలాగే PAN కార్డులో మాత్రం 10 డిజిట్ల అల్ఫాన్యూమరిక్ నెంబర్ ఉంటుంది. పాన్ కార్డును వ్యక్తిగత లేదా సంస్థలు, ఎంటీటీలకు ఆదాయ పన్ను శాఖ జారీ చేస్తుంది. 

ప్రస్తుతం అందుబాటులో డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా 120 కోట్ల ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. ఇందులో 41కోట్ల పాన్ కార్డులు కేటాయించడం జరిగింది. వీటిలో 22 కోట్లకు పైగా PAN కార్డులు ఆధార్ నెంబర్‌తో అనుసంధానమై ఉన్నాయి. సెక్షన్ 139 AA (2) ఐటీ చట్టం ప్రకారం.. ప్రతి వ్యక్తి జూలై 1, 2017 నాటికి PAN కార్డు కలిగి ఉన్న వారు మాత్రమే ఐటీ రిటర్స్ దాఖలుకు Aadhaar నెంబర్ సమర్పించేందుకు అర్హులు. పన్ను అధికారులకు తప్పనిసరిగా తమ ఆధార్ నెంబర్ తెలియజేయాల్సి ఉంటుంది.

139AA సెక్షన్ ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం కేంద్ర ప్రభుత్వం 2019 మార్చిలో పాన్ కార్డు ఆధార్ నెంబర్ అనుసంధానానికి సెప్టెంబర్ 30వరకు తుది గడువు విధించింది. 2018లో సెప్టెంబర్ నెలలో సుప్రీం.. కేంద్రం అమలు చేసే ఆధార్ పథకం రాజ్యాంగపరంగా చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. ఐటీ రిటర్స్స్ దాఖలు చేసే సమయంలో తప్పనిసరిగా బయోమెట్రిక్ ఐడీ ఆధార్ సమర్పించాలని, పాన్ కార్డు లేనివారికి ఎలాంటి దరఖాస్తు లేకుండానే నేరుగా పాన్ నెంబర్ ఐటీ శాఖ జారీ చేస్తుంది.