Decrease Corona Cases : దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

సెకండ్ వేవ్ తర్వాత అన్ని రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించిన కరోనా కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతోంది.

Decrease Corona Cases : దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

Decreasing Corona Positive Cases In India

Decreasing corona cases : సెకండ్ వేవ్ తర్వాత అన్ని రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించిన కరోనా కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన డేటా ప్రకారం దాదాపు 18 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నా మరణాల సంఖ్య భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

సెకండ్ వేవ్ మొదలైన తర్వాత దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజుకు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. వేల నుంచి మొదలైన పెరుగుదల ఒకే రోజు నాలుగు లక్షలకు పైగా నమోదై రికార్డు స్థాయికి చేరింది. మధ్యలో ఒకసారి తగ్గినా ఆ మురుసటి రోజు కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కానీ గడిచిన మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా కొత్త కేసుల తగ్గుతూ రావడంతో వైద్య సిబ్బంది ఊపరి పీల్చుకుంటున్నారు.

మరోవైపు కొత్తగా వస్తున్న కరోనా కేసుల సంఖ్య తగ్గినా మరణాలు అదుపులోకి రావడం లేదు. నిన్న ఒక్కరోజే ఏకంగా 4205 మంది కరోనాతో చనిపోయారు. దేశంలో కరోనా వచ్చిన తర్వాత మరణాల పరంగా ఇదే అత్యధికం. అంతకముందు ఒకే రోజు కరోనాతో అత్యధికంగా 4187 మంది చనిపోయారు.

గడిచిన రెండు వారాల్లో ఏకంగా 50 వేల మందిని కరోనా మహమ్మారి పొట్టనపెట్టుకుంది. గత నెల రోజులుగా రోజువారి మరణాల సగటు 3528 గా నమోదైంది. కరోనా విలయతాండవం చేసిన మహారాష్ట్రలో క్రమంగా తగ్గుతున్నా మరణాల సంఖ్యలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.

ఆది, సోమ వారాల్లో 6 వందల లోపు మరణాలు నమోదవ్వగా తిరిగి మంగళవారం మరణాల సంఖ్య 793కు చేరుకుంది. దేశంలో 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యధిక మరణాలు గడిచిన 24 గంటల్లోనే చోటు చేసుకోవడం కరోనా తీవ్రతకు అద్దం పడుతుంది.

ఇక కరోనా కేసుల్లో తగ్గుదల మరణాల్లో పెరుగుదల కనిపిస్తున్నా మొత్తంగా బేరీజు వేస్తే ప్రమాద తీవ్రత తగ్గుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. మే మొదటి వారంలో రెండు సార్లు 4లక్షలకు పైగా కేసులు నమోదవ్వగా మే రెండో వారంలో ఆ సంఖ్య 3 లక్షల 30 వేల దగ్గరే ఉంది. దీంతో ఈ వారంలో కరోనా కేసులు తిరిగి 4 లక్షలకు చేరుకునే అవకాశం లేదని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా తీవ్రత తగ్గుతుండగా దక్షిణాద్రి రాష్ట్రాల్లో పెరుగుదల నమోదవుతుంది. కేరళ, కర్నాటక, తమిళనాడు, గోవా, ఏపీలో కేసులు పెరుగుతున్నాయి. వీటితోపాటు పంజాబ్, వెస్ట్ బెంగాల్ లోనూ కేసులు అదుపులోకి రావడం లేదు. మరోవైపు కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా పాజిటివిటీ రేటు ప్రమాదకరంగానే ఉంది.