భారత భూభాగంలోకి చైనా చొరబాటు…కీలక రిపోర్ట్ ను వెబ్ సైట్ నుంచి తొలగించిన రక్షణశాఖ

  • Published By: venkaiahnaidu ,Published On : August 6, 2020 / 04:48 PM IST
భారత భూభాగంలోకి చైనా చొరబాటు…కీలక రిపోర్ట్ ను వెబ్ సైట్ నుంచి తొలగించిన రక్షణశాఖ

తూర్పు లడఖ్‌లోని భారత భూభాగంలోకి మే నెల ప్రారంభం నుంచే చైనా చొరబడిందని అంగీకరిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్‌లో మంగళవారం ఓ డాక్యుమెంట్‌ను ఉంచింది. అయితే, రెండు రోజుల తరువాత వెబ్‌సైట్ నుంచి ఆ డాక్యుమెంట్ ను రక్షణశాఖ తొలగించింది.



LAC వెంబడి ముఖ్యంగా మే- 5,2020 నుంచి గల్వాన్ వ్యాలీ దగ్గర చైనా చొరబాట్లను ముమ్మరం చేసింది.. మే 17-18 తేదీలలో కుంగ్రాంగ్ నాలా, గోగ్రా, పాంగాంగ్ సరస్సు ఉత్తర తీర ప్రాంతాలలో చైనా వైపు అతిక్రమణ జరిగిందని రక్షణ మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో ఉంచిన ఆ రిపోర్ట్ లో ఉంది. రక్షణ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ‘వాట్స్ న్యూ’ సెక్షన్‌లో ‘LAC వెంబడి చైనా దూకుడు’ పేరుతో ఈ డాక్యుమెంట్ ప్రచురించింది.

సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరు దేశాల సైనికాధికారుల మధ్య క్షేత్రస్థాయి చర్చలు జరిగాయి.. జూన్ 6న కార్ప్స్ కమాండర్‌స్థాయి సమావేశం జరిగిన తర్వాత జూన్ 15న ఇరు దేశాల సైనికుల మధ్య గాల్వాన్ లోయ దగ్గర ఘర్షణ చోటుచేసుకుందని తెలిపింది.తర్వాత జూన్ 22న రెండో దఫా చర్చలు జరిగాయి.. ఘర్షణను తగ్గించడానికి సైనిక, దౌత్యస్థాయిలో చర్చలు కొనసాగిస్తూ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నాలు సాగుతున్నా.. ప్రస్తుత ప్రతిష్టంభన సుదీర్ఘంగా ఉంటుందని తెలిపింది.



చైనా ఏకపక్ష దురాక్రమణతో తూర్పు లడఖ్‌లో తలెత్తిన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి మరింత పర్యవేక్షణ, సత్వర చర్య అవసరమని వివరించింది. అయితే, గురువారం ఉదయం ఈ డాక్యుమెంట్‌ను తొలగించడమే కాదు, లింక్ కూడా పనిచేయడంలేదు. అయితే, ఈ డాక్యుమెంట్‌ను తాను ప్రచురించలేదని రక్షణ శాఖ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.

వాస్తవాధీన రేఖ వెంబడి మే నెల ప్రారంభం నుంచే చైనా చొరబడినట్టు ప్రచురించిన తొలి అధికార పత్రం ఇదే. జూన్ 15న గాల్వాన్ లోయ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.



కాగా, ఈ అంశంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ఎల్‌ఏసీ వద్ద భారత భూభాగాన్ని చైనా ద‌ళాలు ఆక్ర‌మించాయని భారత ర‌క్ష‌ణ‌శాఖ మాత్రం ఆ నిజాన్ని దాచిపెట్టిందని, ఈ విషయంపై ప్ర‌ధాని ఎందుకు అసత్యాలు చెబుతున్నార‌ని రాహుల్ ప్రశ్నించారు.