గాలి కాలుష్యంతో ఢిల్లీ వాసుల ఉక్కిరిబిక్కిరి

  • Published By: madhu ,Published On : November 7, 2020 / 09:26 PM IST
గాలి కాలుష్యంతో ఢిల్లీ వాసుల ఉక్కిరిబిక్కిరి

Delhi air quality very poor : ఢిల్లీలో గాలి కాలుష్యం మరింత పెరిగింది. గాలి నాణ్యత సూచి 486గా రికార్డయిందని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ తెలిపింది. పొంగమంచు ఢిల్లీలోని పలు ప్రాంతాలను కప్పేసింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.



వాయుకాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఇప్పటికే కరోనా మహమ్మారితో పలువురు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ కాలుష్యంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాయుకాలుష్యంతో పెద్దవాళ్లతో పాటు కొందరు పిల్లలు గొంతు సమస్యలను ఎదుర్కొంటున్నారు.



ఇక ఢిల్లీ సర్కార్‌ కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటోంది. వాహనాల సరి బేసి విధానంతో పాటు.. సిగ్నల్స్‌ దగ్గర వెహికిల్స్‌ను ఆఫ్‌ చేసేలా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అంతేకాకుండా దీపావళి క్రమంలో బాణసంచా కాల్చకుండా నిషేధం విధించింది. దుమ్ము కణాలు గాలిలో కలవకుండా ప్రత్యేకంగా స్మోగ్‌ గన్‌లను వినియోగిస్తోంది.



ఓ పక్క కాలుష్యం కకావికలం చేస్తుంటే.. పంజాబ్‌ రైతులు మాత్రం పంట వ్యర్థాల దగ్థం చేయడం మాత్రం ఆపడం లేదు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో పంజాబ్‌తో పాటు ఢిల్లీ కూడా ఈ పొగతో అల్లాడుతోంది.



మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో 30 మంది రైతులపై కేసులు నమోదయ్యాయి. పంట పొలాల్లో వరికొయ్యలను దహనం చేసినందుకు కేసులు నమోదు చేశారు. ఎనిమిది మంది జరిమానా చెల్లించకపోవడంతో జైలుకు తరలించారు. యూపీ, పంజాబ్‌ సహా పలు రాష్ట్రాలు వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వ్యవసాయ పొలాల్లో కొయ్యలు, వ్యర్థాలు కాల్చివేయడంపై నిషేధం విధించాయి.