ఇండిగో విమానంలో మంటలు : గోవాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • Published By: sreehari ,Published On : September 30, 2019 / 07:39 AM IST
ఇండిగో విమానంలో మంటలు : గోవాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఢిల్లీకి చెందిన ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని గోవా విమానశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులు సహా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. 180  మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండిగో విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాల్లోనే ఇంజిన్ లో పొగ కమ్మేసి మంటలు చెలరేగాయి.

అప్రమత్తమైన పైలట్, విమాన సిబ్బంది వెంటనే ఇండిగో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు గోవా పర్యావరణ శాఖ మంత్రి నిలేశ్ క్యాబ్రెల్ మీడియాకు వెల్లడించారు. ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. 

ప్రయాణికులంతా బిగ్గరగా కేకలు వేయడంతో గందరగోళం నెలకొంది. అప్రమత్తమైన పైలట్.. విమానంలోని రెండు ఇంజిన్లలో ఒక ఇంజిన్ ఆపివేశాడు. మరో ఇంజిన్ సాయంతో పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. 

ఢిల్లీ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఎయిర్ లైన్ మరో విమానాన్ని ఏర్పాటు చేసింది. ఇండిగో విమానంలో మంత్రి క్యాబ్రెల్ కూడా ఉన్నారు. ఢిల్లీలో మీటింగ్ హాజరయ్యేందుకు ఇదే విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆయన వెంట డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ తో పాటు కొంతమంది వైద్య సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎయిర్ లైన్ ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు.