Delhi Budget2023: రూ.78,800 కోట్లతో ఢిల్లీ బడ్జెట్.. హైలైట్స్ ఏంటంటే?

Delhi Budget2023: రూ.78,800 కోట్లతో ఢిల్లీ బడ్జెట్.. హైలైట్స్ ఏంటంటే?

Delhi budget 2023: key points from delhi budget

Delhi Budget2023: ఢిల్లీ ప్రభుత్వం బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టింది. వాస్తవానికి ఈ బడ్జెట్ మంగళవారమే ప్రవేశపెట్టాల్సి ఉండగా, కేంద్ర హోంశాఖ చేసిన అలక్ష్యం వల్ల ఒకరోజు ఆలస్యమైంది. వాస్తవానికి బడ్జెట్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రెండ్రోజులు యుద్ధమే జరిగింది. ప్రజాఉపయోగాల కంటే ప్రకటనలకే ఎక్కువ బడ్జెట్ కేటాయించారని కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలుపగా, మౌలిక సదుపాయాలకు కేటాయించిన దాంట్లో కనీసం నాలుగో వంతు కూడా ప్రకటనలకు కేటాయించలేదని ఢిల్లీ ప్రభుత్వం తిప్పి కొట్టింది. రెండు రోజుల హైడ్రామా అనంతరం ఢిల్లీ ఆర్థిక మంత్రి కైలాష్ గెహ్లాట్ ఎట్టకేలకు బుధవారం బడ్జెట్ ప్రవేశ పెట్టారు. మొత్తం 78,800 కోట్ల రూపాయలతో ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్‭లో మౌలిక సదుపాయాలకు అత్యధికంగా 20 వేల కోట్లు కేటాయించారు. ఆ తర్వాత విద్యకు అత్యధికంగా 16,600 కోట్ల రూపాయలు కేటాయించారు. వీటితో పాటు బడ్జెట్‭లోని ఇతర కేటాయింపులు ఏంటో చూద్దామా?

ఢిల్లీ బడ్జెట్ 2023-24: కీలక ప్రకటనలు
1. 26 ఫ్లై ఓవర్లు, వంతెనలు, అండర్‌పాస్‌లు నిర్మిస్తామని బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
2. 1,400-కిమీ PWD రోడ్ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయడం.
3. 2023 చివరి నాటికి 1,900 జీరో-ఎమిషన్ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడం, ఇది కర్బన (Co2) ఉద్గారాలను 1.07 లక్షల టన్నులు తగ్గిస్తుంది.
4. 1,400 కొత్త ఆధునిక బస్ షెల్టర్లు నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
5. ఆప్ ప్రభుత్వం(AAP govt) అన్ని కాలనీలను మురుగునీటి నెట్‌వర్క్‌కు అనుసంధానిస్తుంది. యమునాను శుభ్రం చేయడానికి మురుగునీటి శుద్ధి కర్మాగారాల సామర్థ్యాలను పెంచుతుంది.
6. రెండేళ్లలో ఢిల్లీలో 3 పర్వతాల చెత్తను తొలగించడానికి మున్సిపాలిటీకి (MCD) సాధ్యమైన ప్రతి సహాయం అందిస్తామని చెప్పారు. డిసెంబర్ 2023 నాటికి ఓఖ్లా ల్యాండ్‌ఫిల్, మార్చి 2024 నాటికి భల్స్వా, డిసెంబర్ 2024 నాటికి ఘాజీపూర్ పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. పల్లపు ప్రాంతాలను చదును చేయడానికి MCDకి రూ. 850 కోట్లు లభిస్తాయి.
7. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థానిక సంస్థలకు రూ.8,241 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.
8. ఢిల్లీ ప్రభుత్వం డీఎంఆర్‭సీ (DMRC) సహకారంతో 3 ప్రత్యేకమైన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌లను నిర్మించనుంది.
9. ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న 57 బస్ డిపోల విద్యుదీకరణ, 9 కొత్త బస్ డిపోలు, 3 ISBTలు, 2 బహుళస్థాయి బస్ డిపోల నిర్మాణం.
10. పరిశుభ్రమైన యమునా కోసం 6-పాయింట్ యాక్షన్ ప్లాన్.
11. ఢిల్లీలోని పూర్తి స్థాయిలో వైద్యసాయం చివరి లబ్దిదారునికి అందేలా మొహల్లా బస్ పథకం.
12. 2023-24లో 100 ఈ-బస్సులు ప్రవేశపెట్టనున్నారు. రాబోయే 2 సంవత్సరాలలో 2,180కి పెంచుతారట.
13. మార్చి 2024 నాటికి ఢిల్లీ రోజుకు 890 మిలియన్ గ్యాలన్ల మురుగునీటిని శుద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
14. ఢిల్లీలోని 350 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో స్కూలుకు 20 కంప్యూటర్లు, అన్ని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, వైస్ ప్రిన్సిపాల్‌లు ట్యాబ్లెట్‌లను అందిస్తామని తెలిపారు.
15. ఢిల్లీ ప్రభుత్వం 2023-24లో 100 మహిళా మొహల్లా క్లినిక్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది.
16. 9 కొత్త ఆసుపత్రులు నిర్మిస్తారట. దీంతో ప్రస్తుతం ఆసుపత్రిలో పడకల సంఖ్య 14,000 నుంచి 30,000కి పెరుగుతుంది.
17. మార్చి 2025 నాటికి ఢిల్లీలో నీటి లభ్యత రోజుకు 995 మిలియన్ గ్యాలన్ల నుంచి 1,240 మిలియన్ గ్యాలన్లకి పెరుగుతుంది.