36గంటల్లోనే అదుపులోకి…ఢిల్లీ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర

  • Published By: venkaiahnaidu ,Published On : March 11, 2020 / 02:36 PM IST
36గంటల్లోనే అదుపులోకి…ఢిల్లీ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర

గత నెలలో ఈశాన్య ఢిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లు, హింసాకాండతో ప్రమేయం ఉన్న ఏ ఒక్కర్నీ వదిలిపెట్టేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హెచ్చరించారు ఢిల్లీ అల్లర్లపై బుధవారం(మార్చి-11,2020) లోక్‌సభలో జరిగిన చర్చ జరిగింది. ఫిబ్రవరి 25న చోటుచేసుకున్న అల్లర్లలో మృతి చెందిన వారికి, వారి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా సంతాపం తెలిపారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. దేశ రాజధానిలో అల్లర్లు దురదృష్టకరమన్నారు.

ఫిబ్రవరి 25వ తేదీ తర్వాత ఎలాంటి అల్లర్లు చోటుచేసుకోలేదని చెప్పారు. అల్లర్లను రాజకీయం చేసే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. సీఏఏపై ప్రజలను విపక్షాలు రెచ్చగొట్టాయని ఆయన ఆరోపించారు. విపక్షాలు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. అల్లర్లను తాము తేలిగ్గా తీసుకోమని, ప్రాథమిక సమాచారం ప్రకారం అల్లర్లు ముందస్తు వ్యూహంతో జరిగినట్టు తెలుస్తోందని అన్నారు.

ఇందుకు బాధ్యులైన వారు ఏ మతానికి, కులానికి, రాజకీయ పార్టీకి చెందిన వారైనా సరే వదిలి పట్టేది లేదని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 22న సుమారు 60 సోషల్ మీడియా అకౌంట్లు తెరుచుకున్నాయని, 26న వాటిని వాటిని క్లోజ్ చేశారని వివరించారు. దీని వెనుక ఎవరున్నారో తెలుసుకుంటామని చెప్పారు. విద్వేషాలను రెచ్చగొట్టేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకున్నారని చెప్పారు. 

కుట్ర జరగకుండా ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద ఎత్తున అల్లర్లు విస్తరించడం సాధ్యం కాదని అమిత్‌షా తెలిపారు. కుట్ర కోణం నుంచి కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈశాన్య ఢిల్లీలో హింసకు నిధులు సమకూర్చిన ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. అమాయకుల మీద చర్యలు తీసుకోమని కూడా సభాముఖంగా ఆయన హామీ ఇచ్చారు. ఆయుధాల చట్టం కింద 49 మందిపై కేసులు నమోదు చేశామని, 153 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఫిబ్రవరి 25 నుంచి 650కి పైగా శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించామని తెలిపారు.

ఢిల్లీ అల్లర్ల సమయంలో పోలీసుల పాత్రపై చేస్తున్న విమర్శలను అమిత్‌ షా తిప్పికొట్టారు. ఢిల్లీ పోలీసులు కేవలం 36 గంటల్లో అల్లర్లను అదుపులోకి తెచ్చారని చెప్పారు. అల్లర్లపై పోలీసులు దర్యాప్తు చేపట్టారని,  ఆ నివేదికను కూడా త్వరలోనే సమర్పిస్తారని చెప్పారు. అల్లర్లు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా డిల్లీ పోలీసులు చేసిన కృషి ప్రశంసనీయమని అమిత్‌ షా అన్నారు. అర్థవంతమైన చర్చ,ఓటింగ్ తర్వాతనే సీఏఏ పార్లమెంట్ ఆమోదం పొందిందని,సీఏఏ వల్ల ఓ ఒక్క భారతీయుడి పౌరసత్వం పోదని ఈ సందర్భంగా అమిత్ షా పునరుద్ఘాటించారు.

ఢిల్లీ అల్లర్లకు బాధ్యత వహిస్తూ అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు…ప్రభుత్వ నిష్క్రియాపరత్వానికి నిరసనగా లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. అల్లర్లపై జరిగిన చర్చలో అమిత్‌షా పాల్గొని, వివరణ ఇస్తుండగా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. ప్రభుత్వం ఏమి చెబుతుందో వినాలని స్పీకర్ ఓం బిర్లా చేసిన విజ్ఞప్తిని విపక్ష సభ్యులు పట్టించుకోలేదు.