ఢిల్లీలోనే ట్రంప్ : ఆగని సీఏఏ హింస…రాజ్ ఘాట్ దగ్గర కేజ్రీవాల్ మౌనదీక్ష

  • Published By: venkaiahnaidu ,Published On : February 25, 2020 / 10:57 AM IST
ఢిల్లీలోనే ట్రంప్ : ఆగని సీఏఏ హింస…రాజ్ ఘాట్ దగ్గర కేజ్రీవాల్ మౌనదీక్ష

ఈశాన్య ఢిల్లీ తగులబడుతోంది. మూడు రోజుల క్రితం ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో సీఏఏకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు చేసిన నిరసన ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఈ హింస కారణంగా ఇప్పటివరకు ఏడుగురు చనిపోగా.. అందులో ఒకరు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. ఓ డీసీపీకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. పలు వాహనాలను ఆందోళనకారులు తగులబెట్టేశారు.

అయితే ఇవాళ(ఫిబ్రవరి-25,2020)కూడా ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి అదుపులోకి రాలేదు. అల్లర్లకు మతకలహాల రంగు పులుముకుంది. ఏ మతము మీది అంటూ దాడులకు పాల్పడుతున్నారు. ఈశాన్య ఢిల్లీలోని భజన్ పూర్,చాంద్ బాగ్ మౌజ్ పూర్, బాబర్ పూర్ ఏరియాల్లో దుండగులు దుకాణాలకు నిప్పుపెట్టారు. సీఏఏకు అనుకూలమా,వ్యతిరేకమా అంటూ దారినిపోయేవాళ్లకు కూడా ప్రశ్నించి వారిపై ఆందోళనకారులు దాడులకు దిగారు. భవనాలపై నిలబడి రోడ్డుపై వెళ్తున్నవారిపై దాడులకు దిగుతున్నారు.

 ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ రాజ్ ఘాట్ వద్ద మౌనదీక్షకు దిగారు. ఏదైనా మాట్లాడి చర్చించుకోవాలి కానీ ఇటువంటి హింసాత్మక ఘటనలు కరెక్ట్ కాదు అని ఇవాళ ఉదయం కేజ్రీవాల్ చెప్పినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయి హింసాత్మక ఘటనలు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ఏం చేయాలో తెలియక కేజ్రీవాల్ రాజ్ ఘాట్ దగ్గర మౌనదీక్షకు కూర్చున్నారు.

పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిన 15వేల కంపెనీల పారామిలటరీ బలగాలు. ప్రస్తుతం ఢిల్లీలోనే అమెరికా అధ్యక్షుడు ఉన్న సమయంలోనే ఢిల్లీలో ఆందోళను చెలరగం కీలకంగా మారింది. పోలీసులు,సీఏఏ ఆందోళనకారులు మధ్య ఈ సమయంలో ఏదైనా జరిగి ప్రాణనష్టం జరిగితే అంతర్జాతీయంగా భారత్ కు చెడ్డపేరు వచ్చే అవకాశముంది.

మరోవైపు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా..సీఎం కేజ్రీవాల్,ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సహా పలువరు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందును అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించారు. పోలీసు ఉన్నతాధికారులతో ఓ పీస్ కమిటీని ఏర్పాటు చేశారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చే బాధ్యతను కమిటీకి అప్పగించారు.

 ఢిల్లీలో ప్రశాంత పరిస్థితిని నెలకొల్పేందుకు అన్ని రాజకీయ పార్టీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించడం జరిగిందనని అమిత్ షాతో మీటింగ్ తర్వాత కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ పోలీసుల పరిధి తక్కువేనని, అయితే అవసరమైన బలగాలను అందించగలమని అమిత్‌షా హామీ ఇచ్చారని తెలిపారు. భారత సాయుధ బలగాల మోహరింపును కోరారా అని అడిగినప్పుడు, ప్రస్తుతానికి పోలీసులే తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. దీనికిముందు కేజ్రీవాల్ ఢిల్లీ సరిహద్దులు మూసేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ, బయట నుంచి వ్యక్తులు వస్తున్నారంటూ సరిహద్దు ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు చెబుతున్నారని, సరిహద్దులు సీల్ చేసి, ముందస్తు అరెస్టులు చేయాలని అన్నారు.

మరోవైపు దాడులకు పాల్పడతున్నవారిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు డ్రోన్లను కూడా ఢిల్లీలో రంగంలో దించారు. అంతకుముందు ఢిల్లీ అల్లర్లలో గాయపడిన వారిని సీఎం అరవింద్ కేజ్రీవాల్,డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గురు తేగ్ బహదూర్ (జిటిబి) ఆసుపత్రిలో కలిసి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు