6గంటలు క్యూలో ఉండి…నామినేషన్ ఫైల్ చేసిన కేజ్రీవాల్

  • Published By: venkaiahnaidu ,Published On : January 21, 2020 / 03:19 PM IST
6గంటలు క్యూలో ఉండి…నామినేషన్ ఫైల్ చేసిన కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇవాళ(జనవరి-21,2020)న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ ఫైల్ చేసేందుకు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయంలో 6 గంటలు వేచి ఉడాల్సి వచ్చింది. జామ్‌నగర్‌లోని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు తన నామినేషన్‌ను కేజ్రీవాల్‌ దాఖలు చేశారు. అయితే మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరైతే రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయానికి చేరుకుంటారో వారి నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు. ఈ వెసులుబాటుతో కేజ్రీవాల్‌ నామినేషన్‌ దాఖలుకు ఎలాంటి అంతరాయం కలగలేదు.

తన టోకెన్‌ నంబర్‌ 45.. నామినేషన్‌ దాఖలు చేసేందుకు వేచి ఉన్నానని కేజ్రీవాల్‌ మంగళవారం మధ్యాహ్నం 2:36 గంటలకు ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో ఒక్క రోజే 100 మంది నామినేషన్లు దాఖలు చేసేందుకు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వద్దకు వచ్చారు. భారతీయ జనతా పార్టీ కావాలనే కేజ్రీవాల్‌ కంటే ముందు 45 మంది స్వతంత్ర అభ్యర్థులను నామినేషన్‌ దాఖలుకు లైన్లో నిల్చోబెట్టిందని ఆప్‌ ఆరోపించింది. బీజేపీ బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేస్తుందని ఆప్‌ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన ఢిల్లీకి మళ్లీ కేజ్రీవాల్‌ సీఎం అవుతారని తేల్చిచెప్పారు.

అయితే కేజ్రీవాల్ సోమవారమే నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండగా రోడ్ షో కారణంగా ఆయన సకాలంలో ఎలక్షన్ కార్యాలయానికి చేరుకోలేకపోయారు. దీంతో ఇవాళ ఆరు గంటలు వేచి నామినేషన్ ఫైల్ చేశారు. ఫిబ్రవరి-8,2020న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 11న ఫలితాలు వెలువడనున్నాయి.

2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 67సీట్లతో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా 2015 రిపీట్ చేసేందుకు కేజ్రీవాల్ కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ఆప్ ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు బీజేపీ కూడా ఢిల్లీ ఎన్నికలపై ఫుల్ సీరియస్ గా వర్క్ చేస్తుంది. ఇక కాంగ్రెస్ అయితే ఈ రేస్ లో వెనుకబడినట్లే చెప్పవచ్చు. ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ కు నాయకత్వ లేమి గట్టిగా కన్పిస్తోంది.