డాక్టర్ కు కరోనా… ఢిల్లీ ప్రభుత్వ హాస్పిటల్ మూసివేత

  • Published By: venkaiahnaidu ,Published On : April 1, 2020 / 06:19 AM IST
డాక్టర్ కు కరోనా… ఢిల్లీ ప్రభుత్వ హాస్పిటల్ మూసివేత

ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ప్రభుత్వ హాస్పిటల్ ను మూసివేశారు అధికారు. ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్ కు కరోనా వైరస్(COVID-19) సోకినట్లు తేలడంతో హాస్పిటల్ ను మూసివేశారు. హాస్పిటల్ బిల్డింగ్స్ ఓపీడీ,ఆఫీసుులు మరియు ల్యాబ్ లను మూసివేసి శానిటైజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా సోకిన డాక్టర్ ను కలిసినవారు కూడా క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు. బ్రిటన్ నుంచి వచ్చిన బంధువుల నుంచే డాక్టర్ కు కరోనా సోకిఉండవచ్చు అని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.

ఇటీవల బ్రిటన్ నుంచి డాక్టర్ తమ్ముడు,మరదలు ఢిల్లీకి తిరిగివచ్చారని,వారి నుంచే డాక్టర్ కు వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ తెలిపారు. లండన్ నుంచి తిరొచ్చిన డాక్టర్ మరదలు ఇటీవల డాక్టర్ ఇంటికి వెళ్లి ఆయనను కలిసినట్లు తెలిసిందని సత్యేంద్రజైన్ తెలిపారు.

ఢిల్లీలో ఇప్పటివరకు 121కరోనా కేసులు,రెండు కరోనా మరణాలు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 24 పాజిటివ్ కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. ఈ 24మంది ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ బిల్డింగ్ జరిగిన తబ్లిగ్ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నవారే. కరోనా వైరస్ నేపథ్యంలో గుంపులుగా ఉండకూడదు అని హెచ్చరికలు ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 448మందిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వందల సంఖ్యలో ప్రజలను క్వారంటైన్ కు తరలించినట్లు మంగళవారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. దేశవ్యాప్తంగా అనేకరాష్ట్రాలకు చెందినవారు కూడా నిజాముద్దీన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికోసం ఆయా రాష్ట్రాల 36గంటల నుంచి వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని గుర్తించగా,మరికొంతమందిని ఇంకా గుర్తించాల్సి ఉంది.

అయితే,మంగళవారం మొహల్లా క్లీనిక్ లో పనిచేసే ఓ డాక్టర్,ఆయన భార్యకు కూడా కరోనా సోకినట్లు నిర్థారణ అయిన విషయం తెలిసిందే. సౌదీ అరేబియానుంచి వచ్చిన ఓ మహిళ ద్వారా డాక్టర్ కు,డాక్టర్ ద్వారా ఆయన భార్యకు వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు.  భారతదేశంలో ఇప్పటివరకు 1721 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 48కరోనా మరణాలు నమోదైనట్లు కేంద్రఆరోగ్యశాఖ తెలిపింది.

Also Read | రెయిన్ కోట్స్, హెల్మట్లతోనే కరోనాతో పోరాడతున్న డాక్టర్లు