ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్, జైన్ సంచలన వ్యాఖ్యలు

  • Published By: madhu ,Published On : November 16, 2020 / 10:05 PM IST
ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్, జైన్ సంచలన వ్యాఖ్యలు

Delhi Has Crossed Peak Of Third Covid Wave : కరోనా ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎప్పుడు ఈ వైరస్ అంతం అవుతుందో చెప్పలేకపోతున్నారు. భారతదేశంలో కూడా ఈ వైరస్ విస్తరిస్తూనే ఉంది. పలు రాష్ట్రాలు వైరస్ తో వణికిపోతున్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో మొదట్లో తగ్గుముఖం పడుతుందని అనుకున్న తరుణంలో మళ్లీ పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో..రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.



రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ దాటి..థర్డ్ వేవ్ లోకి ప్రవేశించిందని, అది కూడా పీక్ స్టేజ్ లో ఉందంటూ..వెల్లడించారు. అయినా..మరోసారి లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. నవంబర్ నెలలో థర్డ్ వేవ్ ప్రారంభమైందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండడం మంచిదన్నారు. ప్రజలు నమ్మకం కోల్పోకుండా..తమని తాము కాపాడుకుంటూ..ఇతరులను కాపాడితే మేలు అన్నారు.



ప్రస్తుతం నమోదవుతున్న కేసులకు సరిపడా ఐసీయూ బెడ్స్ అందుబాటులో లేవని తెలుస్తోంది. ఈ తరుణంలో ఆదివారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గవర్నర్ అనిల్ బైజాల్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరయ్యారు.



అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు, అన్ని విభాగాలు కలిసి పనిచేస్తాయని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. డీఆర్‌డీఓ సెంటర్ లో 750 బెడ్స్ ని ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీనిచ్చిందన్నారు. ఢిల్లీ రాష్ట్రంలో ఆదివారం రికార్డు స్థాయిలో 3 వేల 235 కేసులు నమోదయ్యాయి. 95 మంది చనిపోయారు.