ఢిల్లీ అల్లర్లపై అర్ధరాత్రి విచారించిన హైకోర్టు జడ్జీ.. 24 గంటల్లోనే బదిలీ!

  • Published By: sreehari ,Published On : February 27, 2020 / 03:06 AM IST
ఢిల్లీ అల్లర్లపై అర్ధరాత్రి విచారించిన హైకోర్టు జడ్జీ.. 24 గంటల్లోనే బదిలీ!

ఢిల్లీ అల్లర్లను నివారించడంలో పోలీసుల వైఫల్యం, బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ మురళీధర్‌పై బదిలీ వేటు పడింది. ఢిల్లీ హైకోర్టు నుంచి మురళీధర్‌ ఆకస్మిక బదిలీ అయ్యారు. అలర్లపై అర్థరాత్రి విచారణ చేపట్టిన ఆయన్ను 24 గంటలు గడవకముందే పంజాబ్, హర్యాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ న్యాయ మంత్రిత్వ శాఖ నోటీఫికేషన్ జారీ చేసింది.

దేశ రాజధానిలో చెలరేగుతున్న అల్లర్లకు సంబంధించిన పిటీషన్‌పై అర్ధరాత్రి తన నివాసంలో ఆయన విచారణ చేపట్టారు. ఈ పిటీషన్‌పై బుధవారం తెల్లవారు జామున 1:42 నిమిషాలకు జస్టిస్ ఎస్ మురళీధర్ తన అధికారిక నివాసంలో మరో న్యాయమూర్తి జస్టిస్ భంభానితో ఈ విచారణ చేపట్టారు. అనంతరం సత్వర ఆదేశాలను జారీ చేశారు. ఫలితంగా ఆయనను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విచారణ సందర్భంగా బీజేపీకి చెందిన కొందరు నేతలపైనా మురళీధర్ విమర్శలు చేశారు. 

ఈ పరిణామాల మధ్య 24 గంటలు కూడా గడవక ముందే ఎస్ మురళీధర్ బదిలీ కావడం ప్రాధాన్యతను చర్చనీయాంశమైంది. కొలీజియం ఇదివరకే ఆయన బదిలీకి సిఫారసు చేయగా దాన్ని కేంద్రం తాజాగా నోటిఫై చేసింది. మురళీధర్‌ బదిలీపై కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ఢిల్లీ హైకోర్టులో జస్టిస్‌ ఎస్‌. మురళీధర్‌ను పంజాబ్‌, హర్యానాకు బదిలీ చేస్తున్నట్లు ఈ నెల 12వ తేదిన సుప్రీంకోర్టు కొలిజీయం సిఫారసు చేసింది.

ఆయనను బదిలీ చేయాలని 2018 డిసెంబరు, 2019 జనవరిల్లో కేంద్రం చేసిన సిఫారసును అప్పటి సీజే జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తిరస్కరించారు. ఢిల్లీ అల్లర్ల కేసు విచారణ సాగు తున్న దశలో బదిలీ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈశాన్య ఢిల్లీలో అనుకూల, సిఎఎ వ్యతిరేక నిరసనకారుల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో 27 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా గాయపడ్డారు.

జస్టిస్ మురళీధర్ 1984 సెప్టెంబరులో చెన్నైలో తన న్యాయ ప్రాక్టీసును ప్రారంభించారు. 1987లో సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి ఢిల్లీకి మారారు. 2006 లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

Read More>>ఢిల్లీ అల్లర్లలో చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి సాయం