లాక్ డౌన్ ఉల్లంఘిస్తే అంతే…ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన ఆదేశాలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 30, 2020 / 12:44 PM IST
లాక్ డౌన్ ఉల్లంఘిస్తే అంతే…ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన ఆదేశాలు

కరోనా వైరస్(COVID-19)వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా 21రోజుల లాక్ డౌన్ కు గత వారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ ను పట్టించుకోకుండా చాలామంది ఇంకా రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ఈ సమయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 21 రోజుల లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై  తీవ్ర స్థాయిలో స్పందించిన అనిల్ బైజల్… అకారణంగా రోడ్లమీదికి వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్లు, డీసీపీలను ఆయన ఆదేశించారు.

అంతేకాకుండా ఈ-పాస్‌లు లేకుండా తిరుగుతున్న వారిని జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన శిబిరాల్లోకి తరలించాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా జిల్లా మేజిస్ట్రేట్లు, డీసీపీలతో అనిల్ బైజల్ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమావేశం అయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధకానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రత్యేకించి కేంద్రం ఆదేశించిన 21 రోజుల లాక్‌డౌన్ అమలుపై ప్రధానంగా చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా మేజిస్ట్రేట్లు, డీసీపీలను సైతం లెఫ్టినెంట్ గవర్నర్ తీవ్రంగా హెచ్చరించారు. ఆయా జిల్లాల పరిధిలో ఎవరైనా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే అక్కడి జిల్లా మేజిస్ట్రేట్‌తో పాటు డీసీపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు. ఇప్పటివరకు ఢిల్లీలో 72 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్రఆరోగ్యశాఖ తెలిపిన ప్రకారం…దేశవ్యాప్తంగా 1071 కరోనా కేసలు నమోదవగా,29మరణాలు సంభవించాయి.