JetSetGo : ప్రైవేట్ విమానాల్లో డబ్బు తరలింపు? ఢిల్లీ లిక్కర్ స్కామ్‎లో కీలక మలుపు, తెరపైకి కనికా టేక్రివాల్, జెట్ సెట్ గో విమానాలపై ఈడీ నజర్

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేట్ విమానాల్లో డబ్బు తరలించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

JetSetGo : ప్రైవేట్ విమానాల్లో డబ్బు తరలింపు? ఢిల్లీ లిక్కర్ స్కామ్‎లో కీలక మలుపు, తెరపైకి కనికా టేక్రివాల్, జెట్ సెట్ గో విమానాలపై ఈడీ నజర్

JetSetGo : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేట్ విమానాల్లో డబ్బు తరలించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ఈసారి కనికా టేక్రివాల్ అనే మహిళ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కనికా టేక్రివాల్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి భార్య. ఈమెకు జెట్‌ సెట్ గో పేరుతో ప్రైవేట్ చార్టర్డ్ విమానాలు అద్దెకు ఇచ్చే కంపెనీ ఉంది.

ఈ స్కామ్ కి సంబంధించి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ద్వారా కీలక సమాచారం సేకరించింది ఈడీ. శరత్ చంద్రా రెడ్డి భార్య కనికా టేక్రివాల్ కి చెందిన జెట్ సెట్ గో విమానాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన డబ్బును హైదరాబాద్ కు తరలించినట్లుగా గుర్తించింది ఈడీ.

జెట్ సెట్ గో విమానాల రాకపోకల వివరాలు, అందులో ప్రయాణించిన వారి వివరాలను ఇవ్వాలంటూ అక్టోబర్ 17న ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది ఈడీ. అయితే కనికా టేక్రివాల్ కి చెందిన విమానాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు ప్రయాణించినట్లుగా ఏఏఐ నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీని ఆధారంగానే శరత్ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసినట్లు సమాచారం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఢిల్లీ కేంద్రంగా జెట్ సెట్ గో సంస్థను నిర్వహిస్తున్నారు కనికా టేక్రివాల్. ప్రైవేట్ జెట్స్ బుకింగ్స్ ను తమ సంస్థ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. గత నెల 17న ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌కు ఎన్ ఫోర్స్ మెండ్ డైరెక్టరేట్ డిప్యూటీ డైరక్టర్‌ రాబిన్‌ గుప్తా లేఖ రాశారు. శరత్‌ చంద్రారెడ్డి భార్య కనికా టేక్రివాల్‌ నడుపుతున్న ‘జెట్ సెట్ గో’ విమానయాన సంస్థ వివరాలు, నడిపిన ప్రత్యేక విమాన సర్వీసుల రాకపోకలపై వివరాలు ఇవ్వాలని లేఖలో కోరారు.

‘జెట్ సెట్ గో’ పేరుతో ప్రైవేట్ జెట్ చార్టర్డ్ విమాన సర్వీసులు నడుపుతున్నారు కనికా టేక్రివాల్‌. ఢిల్లీ మద్యం కుంభకోణంలో చేతులు మారిన కోట్ల రూపాయల నగదు కనికా ఏర్పాటు చేసిన విమానాల్లోనే తరలించినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. కనికా సీఈఓగా నిర్వహిస్తున్న ‘జెట్‌ సెట్‌ గో’ సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి లేఖ రాసిన తేదీ వరకు నడిపిన అన్ని చార్టర్డ్ విమాన సర్వీసుల వివరాలు ఇవ్వాలని, ఆ ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన వారి వివరాలు, విమాన మేనేజర్ల జాబితా కూడా అందించాలని లేఖలో కోరింది ఈడీ. తాము అడిగిన సమాచారానికి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు పంపాలంది. పీఎంఎల్‌ఏ చట్టం ప్రకారం జరుగతున్న విచారణలో భాగంగా ఈ వివరాలు కోరుతున్నట్లు ఈడీ స్పష్టం చేసింది.