ఓ ప్రముఖ వ్యక్తిపై ఎటాక్‌కి ప్లాన్.. ఐసీస్ ఉగ్రవాది అరెస్ట్

  • Published By: vamsi ,Published On : August 22, 2020 / 10:25 AM IST
ఓ ప్రముఖ వ్యక్తిపై ఎటాక్‌కి ప్లాన్.. ఐసీస్ ఉగ్రవాది అరెస్ట్

ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ దేశ రాజధాని ఢిల్లీలో ఐసిస్ ఉగ్రవాదిని అరెస్టు చేసింది. ఉగ్రవాది నుంచి రెండు ప్రెజర్ కుక్కర్ ఐఈడిలు, ఆయుధాలు, కొన్ని ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ డిప్యూటీ కమిషనర్ (డిసిపి) ప్రమోద్ సింగ్ కుష్వాహా మాట్లాడుతూ, ధౌలా కువాన్ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత ఐఈడిలతో ఉన్న ఐసిస్ ఆపరేటివ్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.



నిన్న(21 ఆగస్ట్ 2020) రాత్రి 11గంటల 12నిమిషాల సమయంలో ఢిల్లీ పోలీసు బృందం పాఠశాల సమీపంలో బైక్ మీద వెళుతున్న ఉగ్రవాదులను వెంబడించింది. మోటారుసైకిల్ నడుపుతున్న వ్యక్తి మొదట పోలీసులపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. తరువాత ప్రతిస్పందనగా పోలీసులు ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు. చివరికి ఉగ్రవాది పట్టుబడ్డాడు. ఈ వ్యక్తి పేరు మొహమ్మద్ యూసుఫ్ అని చెప్పారు పోలీసులు. అతని ఇద్దరు సహచరులు పరారీలో ఉన్నారు.



రాజధాని ఢిల్లీ ఇప్పటికే అప్రమత్తంగా ఉండగా.. భారత సరిహద్దులో ముగ్గురు ఉగ్రవాదుల ప్రవేశం గురించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి పాకిస్తాన్ నుంచి సమాచారం అందింది. ఈ ఉగ్రవాదులు ఒక విఐపిని లక్ష్యంగా చేసుకుని పెద్ద పేలుడు చేయాలని అనుకుంటున్నారు. రాజధానిలో కొంతమంది ప్రముఖులు లక్ష్యంగా ఈ ఉగ్రవాది దాడులకు దిగాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రసిద్ధ వ్యక్తి పేరు ఇంకా తెలియకపోయినా ఉగ్రవాదిని పోలీసులు విచారిస్తున్నారు.



పరారీలో ఉన్న ఉగ్రవాదులను పట్టుకోకపోతే, ఇబ్బందులు తలెత్తుతాయని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. దీని దృష్ట్యా ఢిల్లీ పోలీసుల ఆరు వేర్వేరు బృందాలుగా వివిధ ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే బెంగళూరులో ఐసిస్‌తో సంబంధాలున్నా ఓ డాక్టర్‌ని జాతీయ దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ జరిగి రెండు రోజులైనా కాకముందే… ఢిల్లీలో ఐసిస్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు.