స్టీల్ లాఠీలపై ఢిల్లీ పోలీస్ క్లారిటీ

స్టీల్ లాఠీలపై ఢిల్లీ పోలీస్ క్లారిటీ

Delhi Police రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా త‌మ‌ను అడ్డుకున్న పోలీసుల‌పైకి కొంత మంది నిర‌స‌న‌కారులు ఏకంగా క‌త్తులే దూశారు. శుక్రవారం అలీపూర్ వద్దు రైతు నిరసనల సందర్భంగా జరిగిన దాడిలో ప్రదీప్ కుమార్ అనే పోలీస్ ఆఫీసర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తనపై కత్తులతో దాడి జరిగిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు..నిరసనకారులను ఇనుప లాఠీల‌తో ఎదుర్కోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా ఓ ఫొటో సోమ‌వారం వైర‌ల్ అయింది. డాలును పోలినటువంటి రక్షణ కవచం, స్టీలు లాఠీ, హెల్మెట్ ధరించిన ప్రత్యేక పోలీసు బృందాలకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.

అయితే ఈ వైరల్ ఫొటోపై మంగ‌ళ‌వారం ఢిల్లీ పోలీసు డిపార్ట్‌మెంట్ స్పందించింది. పోలీసుల‌కు ఈ ఇనుప లాఠీలు, ఇనుప ఆర్మ్‌గార్డ్స్ తాము ఇవ్వ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఢిల్లీలోని ఒక ప్రాంతానికి చెందిన పోలీసులు.. ఇనుప లాఠీలు వాళ్ల‌కు వాళ్లుగా ఏర్పాటుచేసుకున్నారు త‌ప్ప తాము ఇవ్వ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. షాదారాకు చెందిన ఈ పోలీసుల‌ను దీనిపై ఇప్పుడు వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా పోలీస్ శాఖ ఆదేశించింది. సీనియ‌ర్ అధికారుల అనుమ‌తి కోర‌కుండానే ఓ స్థానిక పోలీస్ అధికారి ఈ ఇనుప లాఠీల‌కు ఆర్డ‌ర్ ఇచ్చిన‌ట్లు ఓ ఢిల్లీ పోలీస్ అధికార ప్ర‌తినిధి వెల్ల‌డించారు. వీటిని సీనియ‌ర్ అధికారులు చూడ‌గానే.. వారి నుంచి వెన‌క్కి తీసుకున్న‌ట్లు చెప్పారు.

మరోవైపు, సాగు చట్టాలకు వ్యతిరేకంగా సింఘు, టిక్రి సహా గాజీపుర్​ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. అంతేకాకుండా రహదారి మధ్యలో కాంక్రీట్​​ పోతపోసి అందులో పదునైన ఇనుప మేకులను అమర్చారు. మొదట ఢిల్లీ-హరియాణా సరిహద్దుల్లో ఈ విధంగా ఏర్పాటు చేసిన అధికారులు.. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు.